Feeling Weak Despite Normal Reports: రిపోర్టులు బాగున్నా నీరసంగా అనిపిస్తోందా? అయితే ఈ 4 సైలెంట్ ఆరోగ్య సమస్యలే కారణం కావచ్చు..
అయితే ఈ 4 సైలెంట్ ఆరోగ్య సమస్యలే కారణం కావచ్చు..
Feeling Weak Despite Normal Reports: చాలామంది రోజంతా అలసటగా, నిస్సత్తువగా అనిపిస్తోందని ఫిర్యాదు చేస్తుంటారు. ఇందుకోసం థైరాయిడ్, షుగర్, విటమిన్ బి12 వంటి పరీక్షలు చేయించుకున్నా.. రిపోర్టులు అన్నీ నార్మల్‌గానే వస్తాయి. అయినా సరే, కొద్దిపాటి పనికే అలసిపోవడం, ఉత్సాహం లేకపోవడం వంటివి వెంటాడుతుంటాయి. దీనిని కేవలం బలహీనతగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని, దీని వెనుక కొన్ని దాగివున్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలసట వెనుక ఉన్న 4 ప్రధాన కారణాలు:
మీ రక్త పరీక్షలు సాధారణంగా ఉన్నా, మీకు అలసటగా అనిపిస్తుంటే ఈ క్రింది సమస్యలే కారణం కావచ్చు:
క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్: ఈ పరిస్థితిలో ఎంత విశ్రాంతి తీసుకున్నా, ఎంత సేపు నిద్రపోయినా అలసట తగ్గదు. నిద్రలేచిన తర్వాత కూడా శరీరం బరువుగా, నీరసంగా అనిపిస్తుంది. దీనివల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది.
స్లీప్ అప్నియా : నిద్రలో శ్వాసకు పదేపదే అంతరాయం కలగడం వల్ల గాఢ నిద్ర ఉండదు. దీనివల్ల రాత్రి పడుకున్నా సరే, పగటిపూట విపరీతమైన నిద్రమత్తు, తలనొప్పి మరియు అలసట వేధిస్తాయి. నిద్రలో గురక పెట్టడం దీని ప్రధాన లక్షణం.
హార్మోన్ల అసమతుల్యత: కేవలం థైరాయిడ్ మాత్రమే కాదు, శరీరంలోని ఇతర హార్మోన్ల స్థాయిల్లో మార్పులు వచ్చినా శక్తి తగ్గిపోతుంది. ఇది మూడ్ స్వింగ్స్, హఠాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడానికి దారితీస్తుంది.
మానసిక ఆరోగ్య సమస్యలు: డిప్రెషన్, యాంగ్జైటీ వంటివి కేవలం మనసునే కాదు, శరీరాన్ని కూడా అలసిపోయేలా చేస్తాయి. మానసిక ఒత్తిడి శరీరంలోని శక్తిని పూర్తిగా హరించేస్తుంది.
ముఖ్యమైన లక్షణాలు ఇవే:
7-8 గంటలు పడుకున్నా తగ్గని నీరసం.
పనిపై ఏకాగ్రత కుదరకపోవడం.
తరచుగా వచ్చే తలనొప్పి.
శరీరం బరువుగా అనిపించడం.
పరిష్కార మార్గాలు - నిపుణుల సూచనలు:
సమతుల్య ఆహారం: ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలను మీ డైట్‌లో చేర్చుకోండి.
నిద్ర నియమాలు: ప్రతిరోజూ 7-8 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. పడుకునే గంట ముందే మొబైల్, ల్యాప్‌టాప్ వంటి స్క్రీన్లకు దూరంగా ఉండండి.
ఒత్తిడి నిర్వహణ: యోగా, ధ్యానం మరియు క్రమం తప్పని వ్యాయామం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి.
వైద్య సంప్రదింపు: పైన పేర్కొన్న లక్షణాలు సుదీర్ఘ కాలం పాటు ఉంటే, వెంటనే నిపుణులైన వైద్యుడిని సంప్రదించి మరిన్ని పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.