Gaining Weight but Still Nutrient Deficient: రోజుకు మూడు పూటలా కడుపునిండా భోజనం చేయడం, బరువు బాగా పెరగడం, బయటకు చూస్తే ఆరోగ్యంగానే కనిపిస్తుండడం... అయినా శరీరంలో విటమిన్లు, పోషకాల లోపం ఉండవచ్చా? వైద్యుల సమాధానం మాత్రం ఖచ్చితంగా ఉండవచ్చు అనే.. బాగా లావుగా లేదా అధిక బరువుతో ఉన్నప్పటికీ శరీరంలో విటమిన్లు, ప్రొటీన్లు, ఐరన్ లేదా ఇతర కీలక పోషకాల లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో 4,000 మందిపై నిర్వహించిన తాజా జీవక్రియ ఆరోగ్య సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

అధ్యయనంలో తేలిన కీలక విషయాలు..

మిలీనియల్స్‌లో ఊబకాయం:

ఈ అధ్యయనం ప్రకారం 55.7 శాతం మంది మిలీనియల్స్ అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు.

విసెరల్ ఫ్యాట్ ముప్పు:

45 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 70.8 శాతం మందికి అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుపోయే అత్యంత ప్రమాదకరమైన కొవ్వు అధిక స్థాయిలో ఉన్నట్లు తేలింది.

బరువు నార్మల్ అయినా ప్రమాదం:

అధ్యయనంలో సాధారణ బాడీ మాస్ ఇండెక్స్ ఉన్న 176 మందిలో కూడా విసెరల్ ఫ్యాట్ అధికంగా ఉండడం గమనార్హం. అంటే కేవలం బరువును బట్టి లేదా బీఎమ్‌ఐను చూసి ఎవరూ తమ శరీరం పూర్తిగా ఫిట్‌గా ఉందని భావించలేరు.

కడుపు నిండుతోంది కానీ పోషకాలు అందడం లేదు..

ఆహార లోపం అనేది కేవలం బక్కపలుచగా ఉన్నవారికే వస్తుందనుకోవడం పెద్ద పొరపాటని పసిఫిక్ వన్‌హెల్త్ హాస్పిటల్ నిపుణులు డాక్టర్ ఐజాజ్ ఇల్మీ పేర్కొన్నారు.

పట్టణ జీవనశైలిలో ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్ మరియు ఎక్కువ కేలరీలు ఉండే ఆహారాలు సులభంగా కడుపు నింపుతున్నాయి. అయితే వీటిలో తగినంత ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉండవు. దీనివల్ల శరీరానికి ఎక్కువ కేలరీలు లభిస్తున్నప్పటికీ అవసరమైన పోషకాలు లోపిస్తున్నాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వుకు, విటమిన్-డి తీవ్ర కొరతకు మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

బరువు తగ్గే క్రమంలో చేసే తప్పులు

.

డైటీషియన్ కనికా మల్హోత్రా ప్రకారం... బరువు తగ్గడమంటే ఆహారాన్ని పూర్తిగా మానేయడం కాదు. చాలామంది త్వరగా బరువు తగ్గాలనే ఆరాటంలో అన్నం, రొట్టెలు లేదా భోజనాన్ని పూర్తిగా తగ్గించేస్తుంటారు. దీనివల్ల ప్రొటీన్, ఇతర అత్యవసర పోషకాలు లోపిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఇందులో తగినంత ప్రొటీన్, ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, ఫైబర్ ఉండేలా చూసుకోవాలి.

అంతర్గత ఆరోగ్యంపై దృష్టి పెట్టండి

అధిక బరువు ఉన్నవారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, ప్రీ-డయాబెటిస్, ఫ్యాటీ లివర్ మరియు కొలెస్ట్రాల్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. అందుకే కేవలం బరువు చూసుకోవడమే కాకుండా... క్రమం తప్పకుండా వైద్యుల సలహాతో బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్, విటమిన్ స్థాయిలను పరీక్షించుకోవడం ఎంతో ముఖ్యం.

Tags: