Hand, Foot and Mouth Disease: పిల్లల్లో పెరుగుతున్న హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ వ్యాధి...నిపుణుల సలహాలు ఇవే..

నిపుణుల సలహాలు ఇవే..

Update: 2026-07-18 07:39 GMT

Hand, Foot and Mouth Disease: ప్రస్తుతం మారుతున్న వాతావరణం కారణంగా చిన్నపిల్లల్లో ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తోంది. అదే హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. ముఖ్యంగా పదేళ్ల లోపు వయసున్న పిల్లలు, పాఠశాలలకు వెళ్లే చిన్నార్లు ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాధి లక్షణాలు ఏంటి? తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వ్యాధి ప్రధాన లక్షణాలు ఇవే:

ఇది కాక్సాకీవైరస్ అనే వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి. ఇన్ఫెక్షన్ సోకిన కండరాల నొప్పి, జ్వరం రావడంతో పాటు కింది లక్షణాలు కనిపిస్తాయి:

నోటి పూత:

నాలుకపై, చిగుళ్లపై, నోటి లోపలి భాగంలో నొప్పితో కూడిన చిన్న చిన్న కురుపులు లేదా బొబ్బలు వస్తాయి. దీనివల్ల పిల్లలు ఆహారం తినడానికి, ఉమ్మి మింగడానికి చాలా ఇబ్బంది పడతారు.

చేతులు, కాళ్లపై దద్దుర్లు:

అరచేతులు, అరికాళ్లు, కొన్నిసార్లు మోకాళ్లు, పిరుదుల భాగంలో ఎర్రటి దద్దుర్లు లేదా నీటి బొబ్బలు ఏర్పడతాయి. వీటివల్ల దురద, నొప్పి కలుగుతుంది.

నీరసం, ఆకలి లేకపోవడం:

నోటి నొప్పి వల్ల పిల్లలు సరిగ్గా తినలేక తీవ్రమైన నీరసానికి గురవుతారు.

ఇది ఎలా వ్యాపిస్తుంది?

ఇది చాలా వేగంగా ఒకరి నుంచి ఒకరికి సోకే అంటువ్యాధి. సోకిన పిల్లల లాలాజలం, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపర్లు, వారు తాకిన వస్తువులను ఇతర పిల్లలు తాకడం ద్వారా ఈ వైరస్ సులభంగా వ్యాపిస్తుంది.

తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు - నిపుణుల సలహాలు:

పిల్లలను ఐసోలేషన్‌లో ఉంచండి:

ఇంట్లో ఒక బిడ్డకు ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే ఇతర పిల్లలకు దూరంగా ఉంచాలి. పూర్తిగా నయమయ్యే వరకు స్కూళ్లకు, డే-కేర్ సెంటర్లకు లేదా బయట ఆటలాడటానికి పంపించకూడదు.

పరిశుభ్రత చాలా ముఖ్యం:

పిల్లల చేతులను క్రమం తప్పకుండా సబ్బుతో కడిగించాలి. వారు ఆడుకునే బొమ్మలు, ఉపయోగించే పళ్ళాలు, గ్లాసులను వేడి నీటితో శుభ్రం చేయాలి.

లిక్విడ్స్ ఎక్కువగా ఇవ్వండి:

నోటి పూత వల్ల పిల్లలు గట్టి పదార్థాలు తినలేరు. కాబట్టి శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఓఆర్ఎస్ నీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, చల్లటి పాలు లేదా సూప్‌లు వంటి ద్రవపదార్థాలను ఎక్కువగా ఇస్తుండాలి. ఘాటుగా, కారంగా ఉండే ఆహారపదార్థాలను అస్సలు ఇవ్వకూడదు.

సొంత వైద్యం వద్దు:

జ్వరం లేదా నొప్పి ఎక్కువగా ఉంటే వెంటనే పీడియాట్రీషియన్ ను సంప్రదించి, వారు సూచించిన మందులను మాత్రమే వాడాలి. మెడికల్ షాపుల నుంచి తెచ్చి సొంతంగా యాంటీబయాటిక్స్ వాడటం మంచిది కాదు.

ఈ వ్యాధి సాధారణంగా వారం లేదా పది రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. దీనికి భయపడాల్సిన పనిలేదు కానీ, నిర్లక్ష్యం చేయకుండా సరైన జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్ ఇతర పిల్లలకు వ్యాపించకుండా అరికట్టవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News