Hantavirus: హంటావైరస్: ఇళ్లలోని ఎలుకల వల్ల ఈ వైరస్ వ్యాపిస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు
నిపుణులు ఏం చెబుతున్నారు
Hantavirus: ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో హంటావైరస్ గురించి మళ్లీ చర్చలు మొదలవడంతో ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ వైరస్ సోకిన ఎలుకల ద్వారానే మనుషులకు వ్యాపిస్తుందని తెలియడంతో.. "మన ఇళ్లలో తిరిగే ఎలుకల వల్ల కూడా ఈ ప్రాణాంతక వైరస్ సోకుతుందా?" అనే అనుమానాలు ఎందరిలోనో తలెత్తుతున్నాయి. వైద్య పరిభాషలో దీనిని "హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ అని పిలుస్తారు.
ఈ నేపథ్యంలో అసలు హంటావైరస్ ఎలా వ్యాపిస్తుంది? దీని లక్షణాలు ఏంటి? భారతదేశంలో దీని ప్రమాదం ఎంతవరకు ఉందనే విషయాలను ఆరోగ్య నిపుణుల ద్వారా వివరంగా తెలుసుకుందాం.
హంటావైరస్ ఎలా సంక్రమిస్తుంది?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ వైరస్ సాధారణంగా సోకిన ఎలుకల మలం, మూత్రం మరియు లాలాజలం ద్వారా మానవులకు వ్యాపిస్తుంది.
ఎలుకల మలం లేదా మూత్రం ఎండిపోయినప్పుడు, అందులోని వైరస్ కణాలు గాలిలో కలుస్తాయి.
మనం ఆ గాలిని పీల్చినప్పుడు ఈ వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది.
చాలా కాలంగా మూసి ఉన్న గదులు, పాత గిడ్డంగులు , చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను శుభ్రం చేసేటప్పుడు ఈ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిర్లక్ష్యం చేయకూడని ప్రారంభ లక్షణాలు..
హంటావైరస్ బారిన పడినప్పుడు కనిపించే కొన్ని ముఖ్యమైన సంకేతాలు ఇవే. వీటిని సాధారణ జ్వరం అని లైట్ తీసుకోకూడదు..
అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం రావడం.
విపరీతమైన ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు.
శరీరం తీవ్రంగా నీరసించిపోవడం.
వైరస్ ముదిరే కొద్దీ శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది కలగడం.
ఇంట్లో ఎలుకల సంచారం ఎక్కువగా ఉండి.. కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
భారతదేశంలో హంటావైరస్ ముప్పు ఉందా?
మన దేశంలో దాదాపు ప్రతి ఇళ్లలోనూ ఎలుకలు సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. అయితే దీనిపై ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ జుగల్ కిషోర్ స్పందిస్తూ ప్రజలకు కీలకమైన భరోసా ఇచ్చారు. "భారతదేశంలో ఇళ్లలో ఎలుకలు ఉన్నప్పటికీ.. మన దేశంలో ఇప్పటివరకు ఎలాంటి హంటావైరస్ కేసులు నమోదు కాలేదు. కాబట్టి అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్లో లేదా ఇళ్లలో తిరిగే ప్రతి ఎలుక ఈ వైరస్‌ను మోసుకుపోదు. లక్షలాది ఎలుకలలో ఏదో ఒకదానికి మాత్రమే ఈ సంక్రమణ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆందోళన చెందకుండా ముందుజాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది" అని ఆయన స్పష్టం చేశారు.
వైరస్ దరిచేరకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇళ్లలో పరిశుభ్రత లేకపోవడం వల్ల ఎలుకల సంఖ్య పెరిగి ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్లవుతుంది. అందుకే ఈ క్రింది నివారణ చర్యలు తప్పనిసరి..
పరిశుభ్రత: ఇల్లు చుట్టుపక్కల పరిసరాలను ఎల్లప్పుడూ క్లీన్‌గా ఉంచుకోవాలి. ఇంట్లో వింత వాసనలు వస్తున్నా, వస్తువులపై ఎలుక కాటు గుర్తులున్నా వెంటనే అప్రమత్తం కావాలి.
ఆహార భద్రత: ఇంట్లోని అన్నం, పప్పులు, ఇతర ఆహార పదార్థాలపై ఎలుకలు వాలకుండా ఎల్లప్పుడూ మూతలు గట్టిగా ఉన్న డబ్బాలలో ఉంచాలి.
రక్షణ కవచం:
చాలా కాలంగా మూసి ఉంచిన పాత గదులను లేదా స్టోర్ రూమ్‌లను శుభ్రం చేసేటప్పుడు విధిగా ఫేస్ మాస్క్ మరియు చేతి గ్లౌజులు ధరించడం సురక్షితం.
సమయానికి చెత్త తొలగింపు:
ఇంట్లోని చెత్తను, ఎంగిలి పదార్థాలను ఎప్పటికప్పుడు పారేయడం ద్వారా ఎలుకలు రాకుండా చూసుకోవచ్చు.
హంటావైరస్ పట్ల భయం వద్దు.. కానీ అప్రమత్తత అవసరం. వంటింటిని, ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఎలుకల సంచారాన్ని అరికట్టి, ఇలాంటి ఎన్నో ఇన్ఫెక్షన్ల నుండి మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చు.