Keep Children Away from Mobile Phones and TV Screens: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలను బుజ్జగించడానికో లేదా వారు అల్లరి చేయకుండా ఉండటానికో తల్లిదండ్రులు చేస్తున్న అతిపెద్ద తప్పు.. వారి చేతికి మొబైల్ ఫోన్ ఇవ్వడం. ఇది పిల్లల బాల్యాన్ని దోచుకోవడమే కాకుండా వారి శారీరక, మానసిక ఎదుగుదలను తీవ్రంగా దెబ్బతీస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్క్రీన్ వ్యసనం.. ఒక తీవ్రమైన సమస్య

తల్లిదండ్రులు తమ పని ఒత్తిడి వల్ల పిల్లలకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా పిల్లలకు మొబైల్ లేదా టీవీని అలవాటు చేస్తున్నారు. దీనివల్ల పిల్లలు సామాజికంగా ఒంటరివారవుతున్నారు. బహిరంగ ఆటలకు దూరమై శారీరక ఎదుగుదల కుంటుపడుతోంది. ఫోన్ తీసేస్తే విపరీతమైన కోపం, అసహనం, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

వైద్యుల సలహా: వయస్సును బట్టి పరిమితులు

పిల్లల మెదడు అభివృద్ధిపై స్క్రీన్ సమయం చూపే ప్రభావాన్ని బట్టి వైద్యులు ఈ సూచనలు చేస్తున్నారు..

2 ఏళ్ల లోపు పిల్లలు: వీరికి మొబైల్ ఫోన్లు అస్సలు ఇవ్వకూడదు. కనీసం వీడియో కాల్స్ కూడా చూపించకపోవడం మంచిది.

2 ఏళ్ల పైబడిన పిల్లలు: చదువు కోసం వాడినా సరే.. రోజుకు 15 నిమిషాల కంటే ఎక్కువ స్క్రీన్ సమయం ఉండకూడదు.

వీడియోలు - రీల్స్: ఆటలు, రీల్స్ వంటి వాటికి పిల్లలను పూర్తిగా దూరంగా ఉంచాలి.

తల్లిదండ్రులు ఏం చేయాలి?

పిల్లలు మొబైల్ వ్యసనం నుండి బయటపడాలంటే తల్లిదండ్రులు రోల్ మోడల్‌గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు:

సమయం కేటాయించండి:

ప్రతిరోజూ పిల్లలతో మాట్లాడటానికి, వారితో ఆడుకోవడానికి ప్రత్యేక సమయాన్ని కేటాయించండి.

బహిరంగ ఆటలు: పిల్లలను బయట ఆడుకునేలా ప్రోత్సహించండి. ఇది వారి శారీరక దృఢత్వానికి తోడ్పడుతుంది.

నో-ఫోన్ జోన్: ఇంట్లో భోజనం చేసేటప్పుడు లేదా పడుకునే ముందు ఫోన్ లేని సమయంపాటించండి.

మీరే మాదిరిగా ఉండండి: పిల్లల ముందు మీరు కూడా ఫోన్ వాడకాన్ని తగ్గిస్తేనే, వారు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు.

ఫోన్ అనేది ఒక సాధనం మాత్రమే, అది మీ బిడ్డకు తోడుగా మారకూడదు. చిన్నప్పుడే వారిపై దృష్టి పెట్టకపోతే, భవిష్యత్తులో అది వారి మానసిక సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదం ఉంది.

Tags: