High BP in Children: పిల్లల్లో బీపీ ఉంటే ఎన్నో దుష్ప్రభావాలు
ఎన్నో దుష్ప్రభావాలు
High BP in Children: ప్రస్తుతకాలంలో పిల్లల్లోనూ హైబీపీ కనిపిస్తోంది. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో హైబీపీ ఉంటే తలనొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వంశ చరిత్రలో బీపీ ఉంటే పిల్లలకు ఆరేళ్లు దాటిన తర్వాత ఏడాదికోసారి బీపీ చెక్ చేయడం మంచిది. జీవనశైలి మార్పులతో దీన్ని తగ్గించొచ్చని సూచిస్తున్నారు.
దీర్ఘకాలంగా అధిక రక్తపోటుతో బాధపడే పిల్లలకు గుండె కండరం మందం అయి గుండె వైఫల్యానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు. కిడ్నీలో రక్తనాళాలు దెబ్బతిని, వడపోత ప్రక్రియ అస్తవ్యస్తమవ్వచ్చు. కంట్లోని రెటీనా దెబ్బతినడం, మెదడుకు రక్త సరఫరా చేసే నాళాలు దెబ్బతిని తలనొప్పి, తలతిప్పు తలెత్తచ్చంటున్నారు. అంతేకాకుండా, రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం వంటి తీవ్ర సమస్యలూ ముంచుకురావొచ్చని వివరిస్తున్నారు.
కంటి వెనుక భాగంలో ఉన్న రక్తనాళాలు (రెటీనా) దెబ్బతినడం వల్ల దృష్టి లోపం లేదా శాశ్వత అంధత్వం ఏర్పడవచ్చు. హైపర్‌టెన్షన్ తరచుగా అధిక బరువు, ఇన్సులిన్ నిరోధకత వంటి ఇతర జీవక్రియ సమస్యలతో ముడిపడి ఉంటుంది, దీనివల్ల భవిష్యత్తులో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.