Breastfeed Your Baby: బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు ఎదురయ్యే ప్రధాన సందేహాల్లో ఒకటి శిశువుకు ఎంతకాలం తల్లిపాలు ఇవ్వాలి? తల్లిపాలు బిడ్డకు సహజసిద్ధమైన అమృతం లాంటి పోషకాహారం. ఇందులో ఉండే పోషకాలు, యాంటీబాడీలు శిశువు సంపూర్ణ శారీరక, మానసిక వికాసానికి తోడ్పడతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ సిఫార్సుల ప్రకారం బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి.

శిశువుకు చేకూరే ప్రయోజనాలు

తొలి పాలు సంజీవని: కాన్పు అయిన వెంటనే వచ్చే చిక్కటి పసుపు రంగు పాలను కొలోస్ట్రమ్ అంటారు. వీటిలో యాంటీబాడీలు పుష్కలంగా ఉండి, బిడ్డకు తొలి రోగనిరోధక కవచంలా పనిచేస్తాయి.

ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ: తల్లిపాలు తాగే శిశువులకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.

సులభ జీర్ణక్రియ: తల్లిపాలు శిశువు పేగుల ఆరోగ్యానికి తోడ్పడటమే కాకుండా సులభంగా జీర్ణమవుతాయి.

దీర్ఘకాలిక ఆరోగ్యం: భవిష్యత్తులో స్థూలకాయం, అధిక బరువు బారిన పడకుండా ఉండటానికి ఇవి దోహదపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

తల్లికి కలిగే లాభాలు

గర్భాశయ రికవరీ: పాలిచ్చే సమయంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది ప్రసవానంతరం గర్భాశయం తిరిగి యథాస్థితికి చేరుకోవడానికి ఉపకరిస్తుంది.

క్యాన్సర్ల ముప్పు తగ్గింపు: క్రమం తప్పకుండా తల్లిపాలు పట్టే మహిళల్లో రొమ్ము, అండాశయ క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మానసిక అనుబంధం: పాలిచ్చే సమయంలో తల్లీబిడ్డల మధ్య ఉండే చర్మ స్పర్శ వారి భావోద్వేగ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

ఎంతకాలం తల్లిపాలు ఇవ్వాలి?

మొదటి 6 నెలలు - కేవలం తల్లిపాలు మాత్రమే

6 నెలల తర్వాత - తల్లిపాలతో పాటు శుభ్రమైన, పోషక విలువలున్న అనుబంధ ఆహారాన్ని ప్రారంభించాలి.

2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ - అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం, రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం వరకు అనుబంధ ఆహారంతో పాటు తల్లిపాలు కొనసాగించవచ్చు.

సమస్యలుంటే నిపుణులను సంప్రదించాలి

కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు, వైద్య కారణాలు లేదా ప్రసవానంతర ఇబ్బందుల వల్ల తల్లులు పాలు ఇవ్వడంలో సవాళ్లు ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒత్తిడికి గురికాకుండా గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ లేదా లాక్టేషన్ కన్సల్టెంట్‌ను సంప్రదించాలి. తల్లి ఆరోగ్యం, బిడ్డ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వైద్యుల సలహా మేరకే సరైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.

Tags: