Curd: వేసవిలో రోజుకు ఎంత పెరుగు తీసుకోవాలో తెలుసా?
ఎంత పెరుగు తీసుకోవాలో తెలుసా?
Curd: ఎండలు మండిపోతున్నాయి. బానుడి భగభగలకు శరీరం త్వరగా అలసిపోవడం, డీహైడ్రేషన్‌కు గురవ్వడం సహజం. ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన అమృతం 'పెరుగు'. శరీరానికి చలువ చేయడంలో పెరుగుకు సాటి మరేదీ లేదు. అయితే, సమ్మర్‌లో ప్రతిరోజూ ఎంత పెరుగు తీసుకోవాలి? ఏ సమయంలో తీసుకుంటే మంచిది? తెలుసుకుందాం.
సాధారణంగా ఆరోగ్యవంతులైన వారు వేసవిలో రోజుకు 200 నుండి 300 గ్రాముల పెరుగును నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అంటే సుమారుగా రెండు కప్పుల పెరుగు. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వేసవిలో వచ్చే గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపులో మంటను తగ్గించడానికి ఇది రామబాణంలా పనిచేస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం, విటమిన్ B12 , పొటాషియం మన శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.
చాలామంది పెరుగును అన్నంతో కలిపి తింటారు. అయితే వేసవిలో పెరుగును నేరుగా తీసుకోవడం కంటే, పలచని మజ్జిగ రూపంలో తీసుకోవడం మరింత శ్రేయస్కరం. మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి, పుదీనా, లేదా అల్లం కలిపి తీసుకుంటే.. అది శరీరానికి చలవ చేయడమే కాకుండా వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. ముఖ్యంగా మధ్యాహ్న భోజన సమయంలో పెరుగు లేదా మజ్జిగను తప్పనిసరిగా చేర్చుకోవాలి.
అయితే ఒక చిన్న జాగ్రత్త! రాత్రి పూట పెరుగు తీసుకోవడం వల్ల కొందరిలో జలుబు లేదా శ్లేష్మం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పగటి పూట తీసుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే, పుల్లటి పెరుగు కంటే తాజాగా తోడుపెట్టిన పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ సమ్మర్‌లో ప్రతిరోజూ రెండు కప్పుల పెరుగును మీ డైట్‌లో భాగం చేసుకోండి..