Excess Polyhydramnios in the Womb Dangerous: గర్భధారణ సమయంలో శిశువు చుట్టూ ఉండే ద్రవాన్ని ఉమ్మనీరు (Amniotic Fluid) అంటారు. ఇది బిడ్డ ఎదుగుదలకు, రక్షణకు చాలా ముఖ్యం. అయితే, ఈ నీరు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే ఆ పరిస్థితిని వైద్య పరిభాషలో 'పాలీహైడ్రామ్నియోస్'అంటారు.

1. తల్లిపై పడే ప్రభావం

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: పొట్ట పరిమాణం అసాధారణంగా పెరగడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడి పడి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.

కాళ్ల వాపులు: గర్భాశయం బరువు పెరగడం వల్ల రక్తనాళాలపై ఒత్తిడి పడి కాళ్లు, పాదాల్లో వాపులు రావచ్చు.

అకాల ప్రసవం: ఉమ్మనీరు ఎక్కువై గర్భాశయం బాగా సాగడం వల్ల, నిర్ణీత సమయం కంటే ముందే (నెలలు నిండకుండానే) నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రసవం తర్వాత రక్తస్రావం: గర్భాశయం బాగా సాగడం వల్ల, డెలివరీ అయ్యాక అది తిరిగి సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది. దీనివల్ల రక్తస్రావం (PPH) అయ్యే ప్రమాదం ఉంది.

2. శిశువుపై పడే ప్రభావం:

అసాధారణ స్థితి : నీరు ఎక్కువగా ఉండటం వల్ల శిశువు గర్భంలో ఇష్టమొచ్చినట్టు కదులుతుంది. దీనివల్ల బిడ్డ తల కిందకు రాకుండా అడ్డంగా లేదా రివర్స్ లో ఉండే అవకాశం ఉంటుంది.

తాడు సమస్యలు: ఉమ్మనీటి సంచి పగిలినప్పుడు నీటి ప్రవాహంతో పాటు బొడ్డుతాడు కూడా కిందకు జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది బిడ్డకు ప్రమాదకరం.

మావి విడిపోవడం: ఒక్కోసారి గర్భాశయం గోడ నుంచి మావి ముందే విడిపోయే అవకాశం ఉంటుంది.

3. ఉమ్మనీరు పెరగడానికి కారణాలు:

గర్భిణీ స్త్రీకి మధుమేహం ఉండటం.

శిశువు మింగడంలో సమస్యలు ఉండటం (శిశువు ఉమ్మనీటిని మింగి, మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. ఆ ప్రక్రియలో ఆటంకం కలిగితే నీరు పెరుగుతుంది).

కవల పిల్లలు ఉన్నప్పుడు. శిశువులో ఏవైనా జన్యుపరమైన మార్పులు ఉండటం.

చాలా సందర్భాల్లో ఉమ్మనీరు కొంచెం ఎక్కువగా ఉన్నా పెద్దగా ప్రమాదం ఉండదు, వైద్యులు దీనిని పర్యవేక్షిస్తూ ఉంటారు. కానీ నీరు మరీ ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్లు స్కానింగ్ (AFI Test) ద్వారా దాన్ని కొలిచి, తగిన జాగ్రత్తలు లేదా చికిత్స సూచిస్తారు.

Tags: