Bleeding Gums and Heart Diseases: చిగుళ్ళ రక్తస్రావం - గుండె జబ్బుల మధ్య సంబంధం ఉందా..?
గుండె జబ్బుల మధ్య సంబంధం ఉందా..?;
Bleeding Gums and Heart Diseases: చిగుళ్లలో రక్తస్రావం కేవలం దంతాల ఆరోగ్యానికి మాత్రమే సంబంధించినది కాదని, అది గుండె జబ్బులకు ఒక సూచన కావచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. హార్వర్డ్ హెల్త్ నిర్వహించిన ఈ పరిశోధన నోటి ఆరోగ్యం, గుండె ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా తెలియజేసింది. సాధారణంగా దంతాలు తోముకునేటప్పుడు లేదా ఏదైనా గట్టి ఆహారం తినేటప్పుడు చిగుళ్ళలో రక్తం కారడం అనేది చాలామందికి ఎదురయ్యే సమస్య. చాలామంది దీనిని సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ చిగుళ్లలో మంట, రక్తస్రావం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ రెండింటికీ మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందో లేదో స్పష్టంగా చెప్పడం కష్టమైనప్పటికీ, కారణాలు మాత్రం ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. చిగుళ్ళ నుండి రక్తస్రావం కలిగించే బ్యాక్టీరియా నోటి ద్వారా రక్తప్రవాహంలోకి ప్రవేశించి, రక్త నాళాలలో మంటను పెంచుతుంది. ఇది గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
మరో సిద్ధాంతం ప్రకారం, ఇది కేవలం బ్యాక్టీరియా వల్ల మాత్రమే కాకుండా చిగుళ్ళ నుండి రక్తం వచ్చినప్పుడు రోగనిరోధక వ్యవస్థ వెంటనే స్పందిస్తుంది. ఈ ప్రతిస్పందన కూడా రక్త నాళాలను దెబ్బతీస్తుందని పరిశోధకులు తెలిపారు. గుండె జబ్బులు, చిగుళ్ళ వ్యాధులకు ఒకే విధమైన ప్రమాద కారకాలు ఉన్నాయని అధ్యయనం సూచిస్తోంది. ముఖ్యంగా ఈ రెండింటికీ ప్రధాన కారణాల్లో ధూమపానం ఒకటి. అలాగే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినడం, వ్యాయామం లేకపోవడం వంటి అలవాట్లు గుండెతో పాటు నోటి ఆరోగ్యానికి కూడా హానికరం. కొన్ని సందర్భాల్లో, ఈ సమస్యలు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది.
లక్షణాలు నివారణా చర్యలు
చిగుళ్ల రక్తస్రావం ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చు:
లక్షణాలు: దంతాలు తోముకునేటప్పుడు లేదా శుభ్రం చేసుకునేటప్పుడు చిగుళ్ళ నుండి రక్తం కారడం. నోటి దుర్వాసన, ఆహారం నమలడం కష్టంగా ఉండటం, దంతాలు పెద్దవిగా కనిపించడం, కొన్నిసార్లు అవి ఊడిపోవడం వంటివి ప్రధాన లక్షణాలు. అధిక చక్కెర తీసుకోవడం, అధిక రక్త చక్కెర, ఊబకాయం వంటి సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు.
నివారణ :
రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం తప్పనిసరి.
మృదువైన బ్రష్‌లను ఉపయోగించడం.
ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్రష్‌ను మార్చడం.
ఫ్లోరైడ్ కలిగిన టూత్‌పేస్ట్, మౌత్ వాష్ ఉపయోగించడం మంచిది.
క్రమం తప్పకుండా దంత వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం.
ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడమే కాకుండా, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు.