Leptospirosis: వర్షాకాలంలో భారీ వర్షాలు, నీటి నిల్వలు, వరదలు సాధారణమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో లెప్టోస్పైరోసిస్ అనే బ్యాక్టీరియా వ్యాధి ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. ఇది సోకిన జంతువుల మూత్రంతో కలుషితమైన నీరు లేదా నేల ద్వారా వ్యాపిస్తుంది. భారతదేశంలో సంవత్సరానికి ఒక లక్ష నుంచి పది లక్షల కేసులు నమోదవుతున్నట్లు అంచనా. ప్రారంభంలో జ్వరం, కండరాల నొప్పి లాంటి సాధారణ లక్షణాలు కనిపించినా, సకాలంలో చికిత్స చేయకపోతే మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం కలుగుతుంది.

లెప్టోస్పైరోసిస్ అంటే ఏమిటి?

ఇది జూనోటిక్ వ్యాధి. అంటే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించేది. లెప్టోస్పైరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఎలుకలు, పశువులు, కుక్కలు, పందులు వంటి జంతువులు దీనిని మోస్తాయి. సోకిన జంతువులు మూత్రం ద్వారా బ్యాక్టీరియాను వదులుతాయి. అది నీరు, నేలను కలుషితం చేస్తుంది. కలుషిత నీరు లేదా నేల చర్మంపై గాయాలు ఉన్న చోట లేదా కళ్లు, ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. కలుషిత నీరు తాగినా కూడా సోకవచ్చు. ఈ బ్యాక్టీరియా తడి నేల, నీటిలో వారాలు లేదా నెలలపాటు జీవించగలదు.

ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి దాదాపు పది లక్షల కేసులు, అందులో సుమారు 60,000 మరణాలు జరుగుతున్నట్లు అమెరికా సీడీసీ అంచనా వేస్తోంది. భారతదేశంలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇది ప్రమాదకరంగా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 181 జిల్లాలకు నివారణ కార్యక్రమాన్ని విస్తరించింది.

లక్షణాలు ఏమిటి?

సోకిన 2 నుంచి 30 రోజుల్లో, సాధారణంగా 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో లక్షణాలు లేకపోవచ్చు. మరికొందరిలో డెంగ్యూ, ఇన్‌ఫ్లుయెంజా లాంటి జ్వర వ్యాధులను పోలి ఉంటాయి.సాధారణ లక్షణాలు:

జ్వరం, చలి

తలనొప్పి

కండరాల నొప్పి (ముఖ్యంగా పిక్కలు, నడుము)

కళ్లు ఎర్రబడటం

వికారం, వాంతులు, విరేచనాలు

పొట్ట నొప్పి, అలసట

కొందరిలో వ్యాధి తీవ్ర రూపం (వెయిల్స్ డిసీజ్)కు చేరుకుంటుంది. అప్పుడు మూత్రపిండాలు దెబ్బతినడం, కాలేయం పనిచేయకపోవడం, కామెర్లు, రక్తస్రావం, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. తీవ్రమైతే మెనింజైటిస్, షాక్, అనేక అవయవాలు విఫలం కావచ్చు.

ఎవరికి ఎక్కువ ప్రమాదం?

వరద నీరు, తడి నేల, జంతువులతో తరచుగా సంబంధం ఉన్నవారికి ప్రమాదం ఎక్కువ. వరి పొలాల్లో పనిచేసే రైతులు, పారిశుద్ధ్య కార్మికులు, మురుగు నీటి పనులు చేసేవారు, వరద సహాయకులు, నీటి నిల్వలు శుభ్రం చేసేవారు ఎక్కువగా బాధపడతారు. బేర్‌ఫుట్‌గా నీటిలో నడిచేవారు, చర్మంపై గాయాలు ఉన్నవారు కూడా ప్రమాదంలో ఉంటారు. ఇది సాధారణంగా మనిషి నుంచి మనిషికి సోకదు.

చికిత్స ఎలా?

వరద నీరు లేదా కలుషిత నీటితో సంబంధం తర్వాత జ్వరం వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కామెర్లు, మూత్రం తగ్గడం, ఊపిరి ఆడకపోవడం, రక్తస్రావం, గందరగోళం, నిరంతర వాంతులు ఉంటే అత్యవసర చికిత్స అవసరం.

చికిత్సకు యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తారు. ప్రారంభ దశలోనే మందులు మొదలుపెట్టడం ముఖ్యం. తేలికపాటి కేసుల్లో డాక్సీసైక్లిన్, అమాక్సిసిలిన్, అజిత్రోమైసిన్ లాంటి మందులు ఇస్తారు. తీవ్రమైతే ఆసుపత్రిలో ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్, ద్రవాలు, ఆక్సిజన్, అవసరమైతే డయాలసిస్ చేస్తారు. ల్యాబ్ పరీక్షలు (పీసీఆర్, ఐజీఎం ఇలైసా) ద్వారా నిర్ధారణ చేస్తారు. స్వయంగా మందులు వేసుకోకూడదు.

నివారణ చర్యలు

వరద నీటిలో నడవకుండా ఉండాలి. అనివార్యమైతే వాటర్‌ప్రూఫ్ బూట్లు, రక్షణ దుస్తులు వాడాలి.

గాయాలను వాటర్‌ప్రూఫ్ డ్రెస్సింగ్‌తో కప్పాలి.

కలుషిత నీరు తాగకూడదు. అవసరమైతే ఉడకబెట్టి తాగాలి.

వరద నీటి తగిలిన ఆహారం విసిరేయాలి.

మెరుగైన డ్రైనేజీ, చెత్త నిర్వహణ, ఎలుకల నియంత్రణ అవసరం.

వర్షాకాలంలో జ్వరం వస్తే కేవలం డెంగ్యూ అని భావించకుండా వైద్య సలహా తీసుకోవడం మంచిది. ముందస్తు గుర్తింపు, సకాల చికిత్సతో ఈ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు.

Tags: