Lung Cancer Without Smoking: స్మోకింగ్ చేయకపోయినా ఊపిరితిత్తుల క్యాన్సర్.. భారత్‌లో షాకింగ్ నిజాలు
భారత్‌లో షాకింగ్ నిజాలు
Lung Cancer Without Smoking: పొగ తాగడం వల్ల మాత్రమే ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందనే భావనలో మీరు ఉన్నారా? అయితే మీరు అలర్ట్ అవ్వాల్సిందే! భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో దాదాపు 50 శాతం మంది అసలు పొగతాగని వారే ఉన్నారని ఇటీవల ప్రముఖ క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ మనీష్ సింఘాల్ వెల్లడించిన అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రధాన కారణాలు ఏమిటి?
స్మోకింగ్ చేయని వారిలో కూడా ఈ క్యాన్సర్ రావడానికి ఈ క్రింది అంశాలు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
గాలి కాలుష్యం : నగరాల్లో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పరోక్ష పొగ : ఇతరులు వదిలిన పొగను పీల్చడం.
కెమికల్స్ ప్రభావం: ఉద్యోగ, పని వాతావరణంలో ప్రమాదకర రసాయనాల ప్రభావానికి గురికావడం.
జన్యుపరమైన కారణాలు
పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతదేశంలో దాదాపు 10 ఏళ్ల ముందే యువకులు, ముఖ్యంగా మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఆలస్యంగా గుర్తింపు.. ప్రధాన సవాలు..
భారత్‌లో దాదాపు 50 శాతం కేసుల్లో క్యాన్సర్ చివరి దశకు చేరుకున్నాకే గుర్తించడం జరుగుతోంది. దీనివల్ల చికిత్స అందించడం వైద్యులకు పెద్ద సవాలుగా మారుతోంది.
ముందస్తు లక్షణాలు ఇవే:
తగ్గకుండా వేధించే దీర్ఘకాలిక దగ్గు
ఛాతీ నొప్పి
కారణం లేకుండా వేగంగా బరువు తగ్గడం
కఫంలో రక్తం పడటం
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై, డాక్టర్ల సలహాతో లో-డోస్ సీటీ స్కాన్ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు.
నూతన వైద్య విధానాలు..
ప్రస్తుతం క్యాన్సర్ వైద్య రంగంలో వచ్చిన మార్పుల వల్ల బయోమార్కర్ టెస్టింగ్ ద్వారా జన్యు మార్పులను గుర్తించి, ప్రతి రోగికి ప్రత్యేకమైన టార్గెటెడ్ థెరపీ లేదా ఇమ్యునోథెరపీ అందించగలుగుతున్నారు. దీనివల్ల సాధారణ కీమోథెరపీ కంటే మెరుగైన ఫలితాలు వచ్చి, బాధితుల ఆయుర్దాయం పెరుగుతోంది.