Stop Eating Sugar: చక్కెర తినడం మానేస్తే శరీరంలో పలు మార్పులు
శరీరంలో పలు మార్పులు
Stop Eating Sugar: రోజువారీ ఆహారంలో భాగంగా తెలియకుండానే మనం అధిక మొత్తంలో తీసుకుంటున్న వాటిలో చక్కెర ఒకటి. టీ, కాఫీ, స్వీట్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, పానీయాల ద్వారా శరీరంలో పేరుకుపోయే ఈ అదనపు చక్కెర.. అనేక ఆరోగ్య సమస్యలకు మూలంగా మారుతోంది. అయితే, ఒక్కసారిగా మీరు చక్కెరను తినడం మానేస్తే (షుగర్ డిటాక్స్), మీ శరీరంలో అనూహ్యమైన, సానుకూల మార్పులు సంభవిస్తాయని పోషకాహార నిపుణులు వైద్యులు చెబుతున్నారు.
మొదట్లో కొంచెం నిస్సత్తువగా అనిపించినా, మీ రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరపడతాయి. దీంతో పగటిపూట వచ్చే ఆకస్మిక అలసట తగ్గి, శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి.చక్కెర, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి చర్మంలో మంట కలిగిస్తుంది. చక్కెరను మానేయడం వల్ల మంట తగ్గి, మొటిమలు ముడతలు తగ్గుతాయి. చర్మం కాంతివంతమవుతుంది.
అధిక చక్కెర కేలరీలు శరీరంలో కొవ్వుగా మారుతాయి. చక్కెర తినడం మానేస్తే, ఆ అదనపు కేలరీలు తగ్గుతాయి. ముఖ్యంగా, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గడం ప్రారంభమవుతుంది. చక్కెరలో ఉండే ఫ్రక్టోజ్ నేరుగా కాలేయానికి చేరుతుంది. అధిక ఫ్రక్టోజ్ వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. చక్కెర మానేయడం వల్ల కాలేయం శుద్ధి అవుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పూర్తిగా చక్కెరను మానేయడం కష్టంగా అనిపిస్తే, మొదటగా ప్రాసెస్ చేసిన చక్కెరల తగ్గించి, పండ్లు వంటి సహజ చక్కెరలకు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.