Stomach Infections: ఎండల తీవ్రత తగ్గి వర్షాకాలం చల్లని గాలులను, ఆహ్లాదాన్ని తెచ్చినప్పటికీ... పలు రకాల కడుపు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా వెంట తెస్తుంది. ఈ సీజన్‌లో వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా వృద్ధి చెందుతాయి. దీనికి తోడు తాగునీటి వనరులు కలుషితమవడం, ఆరుబయట ఆహారం త్వరగా పాడైపోవడం వల్ల వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్, గ్యాస్ట్రోఎంటరైటిస్, టైఫాయిడ్ మరియు హెపటైటిస్-ఎ వంటి ఇన్ఫెక్షన్ల కేసులు గణనీయంగా పెరుగుతాయి. చిన్నపాటి ముందస్తు జాగ్రత్తలు, జీవనశైలి మార్పులతో ఈ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ

వర్షాకాలంలో వ్యాపించే మెజారిటీ ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణం కలుషిత నీరే. వర్షాల వల్ల మురుగునీరు తాగునీటి పైపులైన్లలో కలవడం తరచూ జరుగుతుంటుంది.

కాచి చల్లార్చిన లేదా సరైన పద్ధతిలో ఫిల్టర్ చేసిన నీటినే తాగాలి.

బయటి పానీయాలు, విక్రయించే నీటిని తాగడం మానుకోవాలి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇంటి నుంచే సురక్షితమైన తాగునీటిని తీసుకెళ్లడం మంచిది.

అనుమానం ఉన్న సందర్భాల్లో వాటర్ ప్యూరిఫైయర్లు లేదా క్లోరినేషన్ ట్యాబ్లెట్లను ఉపయోగించాలి.

ఆహారం - తీసుకోవాల్సిన నియమాలు

తాజా ఆహారానికే ప్రాధాన్యం: ఎక్కువసేపు గాలికి వదిలేసిన ఆహారంలో బ్యాక్టీరియా వేగంగా చేరుతుంది. కాబట్టి వండిన వెంటనే వేడిగా ఉన్నప్పుడే ఆహారాన్ని తీసుకోవాలి.

స్ట్రీట్ ఫుడ్‌కు దూరం: రోడ్ల పక్కన అమ్మే చిరుతిళ్లు, ఈగల ముసిరే పదార్థాలు మరియు ముందే కోసి ఉంచిన పండ్లను తినడం పూర్తిగా నివారించాలి.

కూరగాయలు, పండ్ల శుభ్రత

మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లు, కూరగాయలపై మట్టి, పురుగుమందుల అవశేషాలు, సూక్ష్మక్రిములు అధికంగా ఉంటాయి. కేవలం మామూలు నీటితో కడగడం సరిపోదు. అవసరమైతే కొన్ని నిమిషాల పాటు వెనిగర్ లేదా ఉప్పు కలిపిన నీటిలో నానబెట్టి, ఆపై శుభ్రం చేయాలి. తేమ ఎక్కువగా ఉండే ఈ సీజన్‌లో పచ్చి మొలకలు, కట్ చేసి నిల్వ ఉంచిన పదార్థాల వాడకం తగ్గించాలి.

వ్యక్తిగత పరిశుభ్రత అత్యంత కీలకం

వ్యాధికారక క్రిములు శరీరంలోకి చేరకుండా అడ్డుకోవడంలో చేతుల పరిశుభ్రత మొదటి రక్షణ కవచంలా పనిచేస్తుంది. భోజనానికి ముందు, వంట చేసే సమయంలో, టాయిలెట్ ఉపయోగించిన తర్వాత మరియు బయట నుంచి ఇంటికి రాగానే సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

అప్రమత్తత అవసరం

ఒకవేళ వాంతులు, విరేచనాలు మొదలైతే శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఓఆర్‌ఎస్, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటి ద్రవపదార్థాలను ఎక్కువగా అందించాలి. అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి, లేదా సమస్య రెండు రోజులకు మించి కొనసాగితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

Tags: