Headache: ఈ రకం తలనొప్పి వస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. ప్రాణాంతకం కావచ్చు..
ప్రాణాంతకం కావచ్చు..
Headache: ఈ రోజుల్లో తలనొప్పి అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. మితిమీరిన ఒత్తిడి, నిద్రలేమి, అలసట, లేదా గంటల తరబడి మొబైల్ స్క్రీన్లను చూడటం వల్ల చాలా మంది తరచూ తలనొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకుని తాత్కాలికంగా ఉపశమనం పొందడం అందరికీ అలవాటే. కానీ, జాగ్రత్త! ప్రతీ తలనొప్పి సాధారణమైనది కాదు. కొన్నిసార్లు ఇది తీవ్రమైన మెదడు రుగ్మతలకు లేదా పక్షవాతానికి (స్ట్రోక్‌కు) ముందస్తు హెచ్చరిక కావచ్చు. తలనొప్పితో పాటు కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన తలనొప్పి
మీ జీవితంలో ఎన్నడూ అనుభవించనంత తీవ్రమైన తలనొప్పి అకస్మాత్తుగా వచ్చి, కేవలం కొన్ని క్షణాల్లోనే దాని తీవ్రత గరిష్ట స్థాయికి చేరితే వెంటనే అలర్ట్ అవ్వాలి. ఇది మెదడులోని రక్తనాళాలు ఉబ్బడం (బ్రెయిన్ అనూరిజం) లేదా అంతర్గత రక్తస్రావానికి (ఇంటర్నల్ బ్లీడింగ్) సంకేతం కావచ్చు.
జ్వరం, మెడ పట్టేయడం
మీకు తలనొప్పితో పాటు జ్వరం రావడం, మెడ చుట్టూ బిగుసుకుపోయినట్లు అనిపించడం, లేదా మీ గడ్డాన్ని ఛాతీకి ఆనించడానికి ప్రయత్నించినప్పుడు తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడటం వంటివి జరిగితే.. అది మెనింజైటిస్ అనే ప్రమాదకరమైన మెదడు ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. దీనికి తక్షణ అత్యవసర చికిత్స అవసరం.
దృష్టి మసకబారడం, వాంతులు
వస్తువులు రెండు రెండుగా కనిపించడం , హఠాత్తుగా కంటి చూపు మసకబారడం, లేదా తలనొప్పితో పాటు ఆకస్మికంగా వాంతులు కావడం వంటి లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకండి. ఇది కపాలంలోపల ఒత్తిడి పెరిగిందనడానికి ప్రధాన సంకేతం.
శరీరంలో ఒక భాగం బలహీనపడటం
తలనొప్పితో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే అది పక్షవాతం కావచ్చు..
మాట్లాడటంలో ఇబ్బంది కలగడం లేదా మాట ముద్దగా రావడం.
అకస్మాత్తుగా తల తిరగడం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోవడం.
చేయి, కాలు లేదా ముఖంలో ఒక వైపు మొద్దుబారడం లేదా తిమ్మిరి రావడం.
50 ఏళ్లు పైబడిన వారు మరింత అప్రమత్తంగా ఉండాలి:
సాధారణంగా 50 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత మునుపెన్నడూ లేని విధంగా కొత్త రకం తలనొప్పి మొదలైతే వెంటనే న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. ముఖ్యంగా క్యాన్సర్ బాధితులు, లేదా రోగనిరోధక శక్తి %తక్కువగా ఉన్నవారిలో వచ్చే తలనొప్పుల వెనుక తీవ్రమైన కారణాలు ఉండే అవకాశం ఉంది.