Thyroid Problem: పిల్లలలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? థైరాయిడ్ సమస్య కావొచ్చు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే..
నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే..
Thyroid Problem: సాధారణంగా థైరాయిడ్ సమస్యలు కేవలం పెద్దవారికే వస్తాయని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది పొరపాటు. పిల్లలలో కూడా థైరాయిడ్ సమస్య తీవ్రంగా పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయక సమర్థవంతంగా హార్మోన్లను ఉత్పత్తి చేయలేనప్పుడు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల తీవ్రంగా దెబ్బతింటుంది. పిల్లల్లో కనిపించే థైరాయిడ్ ముందస్తు సంకేతాలు మరియు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు అందించిన కీలక విశేషాలు తెలుసుకుందాం..
పిల్లలలో హైపోథైరాయిడిజం ముఖ్య లక్షణాలు:
శారీరక ఎదుగుదల మందగించడం:
వయస్సుకు తగ్గట్టుగా ఎత్తు పెరగకపోవడం, తోటి పిల్లలతో పోలిస్తే చాలా పొట్టిగా ఉండటం పిల్లల్లో థైరాయిడ్ ఉందనడానికి ప్రధాన సంకేతం.
అసాధారణ బరువు పెరుగుదల:
పిల్లలు తక్కువగా తింటున్నా లేదా సరైన ఆహారమే తీసుకుంటున్నా వేగంగా బరువు పెరగడం జరుగుతుంది.
నిరంతరం అలసట & నీరసం:
తగినంత నిద్ర పోయినా పిల్లలు ఎల్లప్పుడూ అలసిపోయినట్లు, ఉత్సాహం లేకుండా కనిపించడం.
చదువుపై దృష్టి పెట్టలేకపోవడం:
జ్ఞాపకశక్తి తగ్గడం, చదువులో వెనుకబడటం, బద్ధకం, చిరాకు ఎక్కువగా ఉండటం.
చర్మం పొడిబారడం & జుట్టు రాలడం:
చర్మం అసాధారణంగా పొడిబారడం, గోళ్ళు త్వరగా విరిగిపోవడం, జుట్టు ఎక్కువగా ఊడిపోవడం.
మలబద్ధకం& చలిని తట్టుకోలేకపోవడం:
జీర్ణక్రియ మందగించడం వల్ల నిరంతరం మలబద్ధకంతో బాధపడటం, అలాగే ఇతరుల కంటే వీరికి చలి ఎక్కువగా అనిపించడం.
చిన్న పిల్లలలో కనిపించే లక్షణాలు:
నవజాత శిశువుల్లో లేదా చిన్నపిల్లల్లో థైరాయిడ్ ఉంటే..
పచ్చకామెర్లు ఎక్కువ రోజులు తగ్గకపోవడం.
పాలు తాగడానికి కష్టపడటం లేదా ఎప్పుడూ నిద్రపోతూ ఉండటం.
బొడ్డు బయటకు రావడం.
తల్లిదండ్రులు ఏం చేయాలి?
ముందస్తు పరీక్షలు:
పిల్లలలో పైన పేర్కొన్న లక్షణాలలో ఏవైనా కనిపించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించాలి.
ఆహారంలో మార్పులు:
థైరాయిడ్ సమర్థవంతంగా పనిచేయడానికి ఐయోడిన్, సెలీనియం, జింక్ పుష్కలంగా ఉండే పోషకాహారాన్ని పిల్లలకు అందించాలి.
రెగ్యులర్ చెకప్:
థైరాయిడ్ సమస్య నిర్ధారణ అయితే వైద్యులు సూచించిన మోతాదులో క్రమం తప్పకుండా మందులు వాడాలి