Postpartum Depression Affects: సాధారణంగా బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి మాత్రమే మానసిక ఒత్తిడి లేదా డిప్రెషన్ వస్తుందని మనం భావిస్తుంటాం. కానీ తాజా అధ్యయనాలు ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాయి. బిడ్డ పుట్టిన తర్వాత తండ్రులు కూడా తీవ్రమైన డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశం ఉందని JAMA నెట్‌వర్క్ ఓపెన్ ప్రచురించిన కొత్త పరిశోధన వెల్లడించింది. దీనినే 'పెరెంటల్ డిప్రెషన్' అని కూడా పిలుస్తారు.

ఈ అధ్యయనం ప్రకారం, సుమారు 30 శాతం మంది తండ్రులు బిడ్డ పుట్టిన కొత్తలో రకరకాల మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఒక కొత్త ప్రాణం తమ జీవితంలోకి ప్రవేశించినప్పుడు కలిగే సంతోషం ఒకవైపు ఉన్నా.. మరోవైపు పెరిగిన బాధ్యతలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాత్రంతా నిద్రలేకపోవడం, బిడ్డ సంరక్షణలో పాలుపంచుకోవడం వల్ల కలిగే శారీరక అలసట, వీటన్నిటికీ మించి ఆర్థిక భవిష్యత్తుపై ఉండే ఆందోళన వారిని డిప్రెషన్‌లోకి నెట్టేస్తున్నాయి.

అయితే ఇక్కడ అసలైన సమస్య ఏమిటంటే.. పురుషులు తమ మనసులోని బాధను లేదా ఒత్తిడిని బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ, తండ్రి మానసిక స్థితి సరిగ్గా లేకపోతే అది కేవలం తనకే కాకుండా.. అప్పుడే పుట్టిన బిడ్డ ఎదుగుదలపై, అలాగే తల్లి ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంట్లో తండ్రి నిరుత్సాహంగా లేదా కోపంగా ఉంటే.. అది కుటుంబంలోని ప్రశాంతతను దెబ్బతీస్తుంది.

అందుకే నిపుణులు ఏం చెప్తున్నారంటే.. బిడ్డ పుట్టిన తర్వాత తండ్రులు కూడా తమ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. కేవలం తల్లి ఆరోగ్యమే కాదు, తండ్రి మనసు కూడా ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు కూడా నిరంతరం ఆందోళనగా ఉన్నా, దేనిమీదా ఆసక్తి కలగకపోయినా.. అది డిప్రెషన్ లక్షణం కావొచ్చు. అలాంటి సమయంలో మొహమాట పడకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడటం లేదా నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం.

Tags: