Protect Your Liver: మీ కాలేయం ప్రమాదంలో ఉందా? ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లు మార్చుకోండి
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లు మార్చుకోండి
Protect Your Liver: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా మారిన జీవనశైలి, జంక్ ఫుడ్ వినియోగం వల్ల ఇటీవల కాలంలో కాలేయ సంబంధిత వ్యాధులు శరవేగంగా పెరుగుతున్నాయి. శరీరంలో అతి ముఖ్యమైన అవయవమైన కాలేయం నిర్విషీకరణ, జీర్ణక్రియ, పోషకాల నిల్వలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది దెబ్బతింటే ఫ్యాటీ లివర్, హెపటైటిస్ వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. వైద్యుల ప్రకారం కాలేయ ఆరోగ్యం కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
దూరంగా ఉండాల్సిన ఆహార పదార్థాలు:
కాలేయాన్ని కాపాడుకోవాలంటే ప్రధానంగా ఈ మూడు రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు:
నూనె, వేయించిన ఆహారాలు: అధికంగా నూనెతో వండిన పదార్థాలు శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేసి, ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీస్తాయి.
చక్కెర అధికంగా ఉండే పదార్థాలు: మితిమీరిన తీపి కాలేయంలో కొవ్వును పెంచడమే కాకుండా, ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది.
ప్రాసెస్ చేసిన ఆహారాలు: ప్యాక్ చేసిన ఆహారాల్లో ఉండే ప్రిజర్వేటివ్‌లు, రసాయనాలు కాలేయంపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి.
కాలేయానికి మేలు చేసే సూపర్ ఫుడ్స్:
కాలేయం పదిలంగా ఉండాలంటే మీ రోజువారీ ఆహారంలో వీటిని తప్పనిసరిగా చేర్చుకోవాలి:
ఆకుకూరలు - కూరగాయలు: పాలకూర, బ్రోకలీ, క్యారెట్, బీట్‌రూట్ కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్స్: వెల్లుల్లి, పసుపు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
నీరు: పుష్కలంగా నీరు త్రాగడం వల్ల శరీరం సహజంగానే శుభ్రపడుతుంది.
ముఖ్య గమనిక: కేవలం ఆహారం మాత్రమే కాదు, క్రమం తప్పని వ్యాయామం, బరువు నియంత్రణ, మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల కాలేయాన్ని దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.