Rising Heart Attack Cases Among Youth: ఒకప్పుడు గుండె సంబంధిత సమస్యలు అంటే కేవలం 60 ఏళ్లు దాటిన వృద్ధులకే వస్తాయని అనుకునేవారు. కానీ, ఇటీవల కాలంలో 20 నుండి 40 ఏళ్ల లోపు యువకులు సైతం అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. అధిక రక్తపోటు, పెరిగిన కొలెస్ట్రాల్, రక్తనాళాల్లో అడ్డంకులు, గుండె స్పందన రేటులో హెచ్చుతగ్గులు వంటి సమస్యలు నేటి తరం యువతలో సర్వసాధారణమైపోయాయి.

యువతలో గుండె జబ్బులకు ప్రధాన కారణాలు:

నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈ మార్పులకు కొన్ని కీలక అంశాలు కారణమవుతున్నాయి..

నిరంతర ఒత్తిడి : కెరీర్, వ్యక్తిగత జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి గుండెపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

మారుతున్న జీవనశైలి: గంటల తరబడి కూర్చుని పని చేయడం, శారీరక శ్రమ అస్సలు లేకపోవడం.

ఆహారపు అలవాట్లు: జంక్ ఫుడ్, అధిక నూనె మరియు ఉప్పు కలిగిన ఆహార పదార్థాల వినియోగం పెరగడం

నిద్రలేమి: సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని గుండె ఆరోగ్యం క్షీణిస్తోంది.

జన్యుపరమైన కారణాలు: కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నట్లయితే, ఆ యువతకు ముప్పు ఎక్కువగా ఉంటుంది.

గుండెను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

గుండె సమస్యలను ప్రాథమిక దశలోనే అరికట్టడానికి ఈ క్రింది సూత్రాలను పాటించడం అత్యవసరం..

ఆరోగ్యకరమైన ఆహారం: సమతుల్యమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు వీలైనంత దూరంగా ఉండాలి.

నిత్యం వ్యాయామం

రోజుకు కనీసం 30 నుండి 45 నిమిషాల పాటు నడవడం లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.

ఒత్తిడి నిర్వహణ: మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలి. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

తగినంత నిద్ర: రోజుకు కనీసం 7 నుండి 8 గంటల గాఢ నిద్ర గుండెకు ఎంతో అవసరం.

రెగ్యులర్ చెకప్స్: 30 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా లిపిడ్ ప్రొఫైల్, బీపీ మరియు షుగర్ పరీక్షలు చేయించుకోవడం మంచిది.

గుండెపోటు అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదు, మన శరీరంలో జరిగే మార్పులను మనం గమనించకపోవడం వల్లే అది ప్రాణాంతకంగా మారుతుంది. ఏవైనా చిన్నపాటి లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

Tags: