Biggest Mistake You’re Making for Vitamin D: ఎండలో కూర్చుంటున్నారా? అయితే విటమిన్-డి కోసం మీరు చేసే అతిపెద్ద తప్పు ఇదే

అయితే విటమిన్-డి కోసం మీరు చేసే అతిపెద్ద తప్పు ఇదే

Update: 2026-01-07 09:58 GMT

Biggest Mistake You’re Making for Vitamin D: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య విటమిన్-డి లోపం. ఎముకల పటుత్వానికి, రోగనిరోధక శక్తి పెంపునకు విటమిన్-డి ఎంతో కీలకం. దీనికోసం చాలామంది ఉదయాన్నే ఎండలో నడుస్తుంటారు. అయితే మనలో దాదాపు 90 శాతం మందికి సూర్యరశ్మి ద్వారా విటమిన్-డి పొందే సరైన విధానం తెలియదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉదయం 8 గంటల ఎండ వల్ల ప్రయోజనం లేదా?

సాధారణంగా అందరూ ఉదయం 7 నుండి 8 గంటల మధ్య వచ్చే లేత ఎండ శరీరానికి మంచిదని భావిస్తారు. కానీ తాజా పరిశోధనల ప్రకారం ఆ సమయంలో సూర్యరశ్మి చాలా బలహీనంగా ఉంటుంది. తద్వారా శరీరంలో విటమిన్-డి ఉత్పత్తి అసలు ప్రారంభమే కాదు. విటమిన్-డి సమర్థవంతంగా అందాలంటే ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య వచ్చే ఎండ అత్యంత ప్రభావవంతమైనది. ఈ సమయంలోనే సూర్యుని నుండి వచ్చే UVB కిరణాలు చర్మాన్ని తాకి విటమిన్-డిని ఉత్పత్తి చేస్తాయి.

సరైన పద్ధతి ఏమిటి?

సూర్యరశ్మి నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే కేవలం ఎండలో నిలబడితే సరిపోదు, ఈ జాగ్రత్తలు పాటించాలి:

ప్రత్యక్ష స్పర్శ: సూర్యకాంతి నేరుగా చర్మాన్ని తాకాలి. కిటికీ గాజుల వెనుక కూర్చోవడం వల్ల ప్రయోజనం ఉండదు, ఎందుకంటే UVB కిరణాలు గాజును దాటి రాలేవు.

సమయం: ప్రతిరోజూ కేవలం 15 నుండి 30 నిమిషాలు ఎండలో గడిపితే సరిపోతుంది.

దుస్తులు: ముఖం, చేతులు, కాళ్లకు ఎండ తగిలేలా చూసుకోవాలి. శరీరాన్ని పూర్తిగా దుస్తులతో కప్పేయడం వల్ల విటమిన్-డి శోషణ జరగదు.

సన్‌స్క్రీన్ వద్దు: ఎండలో కూర్చునే సమయంలో సన్‌స్క్రీన్ లోషన్లు వాడటం వల్ల విటమిన్-డి ఉత్పత్తి ఆగిపోతుంది.

అతిగా వద్దు.. జాగ్రత్త

విటమిన్-డి కోసం గంటల తరబడి ఎండలో ఉండటం కూడా ప్రమాదకరమే. దీనివల్ల చర్మం నల్లబడటం, ముడతలు పడటం లేదా ఇతర చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణీత సమయంలో, తక్కువ సేపు నేరుగా ఎండ తగిలేలా చూసుకోవడమే ఆరోగ్యానికి ఉత్తమ మార్గం.

కాల్షియం, పాస్సరస్ వంటి మూలకాలను శరీరం గ్రహించాలన్నా, కండరాలు దృఢంగా ఉండాలన్నా విటమిన్-డి అత్యవసరం. కాబట్టి ఇకపై తప్పుడు పద్ధతులు మానేసి, సరైన సమయంలో సూర్యరశ్మిని పొంది ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Tags:    

Similar News