Sleeping Less Than 5 Hours: 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ ప్రాణాలకే ముప్పు
అయితే మీ ప్రాణాలకే ముప్పు
Sleeping Less Than 5 Hours: మంచి ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంత ముఖ్యమో, అంతే స్థాయిలో నిద్ర కూడా అవసరమని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక సాధారణ వయోజనుడికి రోజుకు కనీసం 7 నుండి 8 గంటల గాఢ నిద్ర ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది తమ పని ఒత్తిడి లేదా సోషల్ మీడియా వినియోగం కారణంగా నిద్రను 5-6 గంటలకే పరిమితం చేస్తున్నారు. ఇలా నిరంతరంగా తక్కువ నిద్రపోవడం వల్ల శరీరంలో అనేక జీవక్రియలు దెబ్బతింటాయని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం
నిరంతర నిద్రలేమి నేరుగా మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి తగ్గడం, తరచూ చిరాకు కలగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది దీర్ఘకాలంలో మానసిక కుంగుబాటు, అధిక ఆందోళనవంటి తీవ్రమైన మానసిక వ్యాధులకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శారీరక సమస్యలు - ఆయుర్దాయం
నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థ క్రమంగా బలహీనపడుతుంది. దీని ఫలితంగా టైప్-2 డయాబెటిస్, అధిక రక్తపోటు మరియు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రోజుకు కేవలం 5-6 గంటలు నిద్రపోయే వారిలో అకాల మరణం సంభవించే ప్రమాదం 15 శాతం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడించాయి. అంతేకాకుండా సరైన నిద్ర లేని సమయంలో వాహనాలు నడపడం వల్ల పగటిపూట మగతగా ఉండి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా మెండుగా ఉంటుంది.
వయస్సును బట్టి అవసరమైన నిద్ర
ప్రతి వయస్సు వారికి నిద్ర అవసరం మారుతూ ఉంటుంది. 18 ఏళ్లు పైబడిన వారు కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. ఇక టీనేజర్లకు 8-10 గంటలు, 6-12 ఏళ్ల పిల్లలకు 9-12 గంటల నిద్ర అవసరం. చిన్న పిల్లల విషయంలో, అంటే 1-5 ఏళ్ల వయస్సు గల వారికి కనీసం 10 నుండి 14 గంటల నిద్ర ఉంటేనే వారి ఎదుగుదల సక్రమంగా ఉంటుంది.
మంచి నిద్ర కోసం అనుసరించాల్సిన సూత్రాలు
నాణ్యమైన నిద్ర పొందడానికి పడక గది ప్రశాంతంగా, చీకటిగా, చల్లగా ఉండేలా చూసుకోవాలి. పడుకునే 30 నిమిషాల ముందే మొబైల్ ఫోన్లు, టీవీ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పక్కన పెట్టేయాలి. అలాగే, నిద్రకు కనీసం 10-12 గంటల ముందు టీ లేదా కాఫీ తాగకుండా ఉండటం మంచిది. రాత్రి పూట మితమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.