Health: మామిడి పండ్లు తింటే ఇన్ని ప్రయోజనాలా?
మామిడి పండ్ల ప్రయోజనాలు;
Health:ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ నడుస్తోంది. ఎక్కడ చూసినా రోడ్లపైన, మార్కెట్లో మామిడిపండ్లే కనిపిస్తున్నాయి. అయితే కొంత మంది మామిడి పండ్లు తింటే వేడి చేస్తుందంటారు. మరి కొందరేమో సీజన్ ఎప్పుడు వస్తుందా.? మామిడి పండ్లు లాగిద్దామనుకుంటారు. అయితే మామిడి పండ్లు తినొచ్చా? తినకూడదా ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
మామిడి పండ్లు తినడం వల్ల రుచి మాత్రమే కాదు అంతకుమించిన పోషకాలూ ఉన్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్. మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. వాటిలోనూ మాంగిఫెరిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ బలంగా ఉంటుంది. అందుకే దీన్ని సూపర్ యాంటీ ఆక్సిడెంట్ అని కూడా ఉంటారు. దీంతో పాటు గాలోటానిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది.
ఇవి శరీరానికి హాని చేసే వైరస్ లేదా బ్యాక్టీరియా వంటివాటి నుంచి కాపాడతాయి. అలాగే మామిడి పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వీటిలో ఉండే బీటా– కెరోటిన్, విటమిన్–సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తి పెరగడానికి సాయపడతాయి. మామిడి పండ్లలో కేలరీలు తక్కువ. కాబట్టి డైట్ చేసే వాళ్లు కూడా నిస్సందేహంగా మామిడి పండ్లను లాగించేయొచ్చు. అయితే భోజనానికి ముందు మామిడి పండ్లను తింటే మంచిది.
వీటిలో నేచురల్ షుగర్స్ ఉంటాయి. కానీ అవి డయాబెటిస్‌కు కారణమయ్యేవి కావు. డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా డాక్టర్ సలహా తీసుకుని తగినంత మోతాదులో తీసుకోవడం వల్ల నష్టమేమీ లేదంటున్నారు. పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడంలో, గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవడంలో హెల్ప్ చేస్తుంది.మామిడి పండ్లలో పాలిఫెనాల్స్ అనేవి ఉంటాయి. దాంతో ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు.. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ లుకేమియా, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, రొమ్ము క్యాన్సర్‌కు దారితీసే కణాల వృద్ధిని అడ్డుకుంటుంది. అంటే క్యాన్సర్ రాకుండా నివారిస్తుందన్నమాట.