Taking Vitamin D Supplements: శరీరంలో కాల్షియం శోషణ జరిగి ఎముకలు, కండరాలు బలంగా ఉండటానికి విటమిన్ డి ఎంతో కీలకం. పిల్లల్లో దీని లోపం వల్ల ఎముకలు వంకర్లు తిరిగే రికెట్స్ వ్యాధి వస్తే, పెద్దలలో ఎముకలు బలహీనపడే ఆస్టియోమలేషియా, తీవ్రమైన ఎముకల నొప్పులు, కండరాల బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. పబ్‌మెడ్ అధ్యయనాల ప్రకారం.. భారతదేశంలో దాదాపు 67 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో చాలామంది శరీర నొప్పులు, నీరసం అనిపించగానే వైద్యుల సలహా లేకుండానే సొంతంగా విటమిన్ డి మాత్రలు, సప్లిమెంట్లు వేసుకోవడం లేదా మధ్యలోనే మానేయడం చేస్తున్నారు. అయితే ఇలా సొంత వైద్యం చేసుకోవడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విటమిన్ డి అనేది కొవ్వులో కరిగే విటమిన్. మనం తీసుకునే మోతాదు ఎక్కువైతే అది మూత్రం ద్వారా బయటకు పోకుండా శరీరంలోనే పేరుకుపోతుంది. కైలాష్ దీపక్ హాస్పిటల్ ఎండోక్రినాలజీ కన్సల్టెంట్ డాక్టర్ నిశాంత్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. రక్త పరీక్షలు చేయించుకోకుండా అధిక మోతాదులో విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ప్రతి వ్యక్తి శరీర తత్వం, వారి శరీరంలో ఉన్న లోపం తీవ్రతను బట్టి మాత్రమే అవసరమైన మోతాదు మారుతుంది.

విటమిన్ డి అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో హైపర్‌కాల్సెమియా అనే ప్రమాదకర పరిస్థితి తలెత్తుతుంది. అంటే, రక్తంలో కాల్షియం స్థాయిలు అసాధారణంగా పెరిగిపోతాయి. దీనివల్ల నిరంతరం వికారం, తీవ్రమైన నీరసం, ఆకలి మందగించడం, విపరీతమైన దాహం, పదేపదే మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా, మూత్రపిండాల్లో ప్రమాదకరమైన రాళ్లు ఏర్పడటంతో పాటు కిడ్నీల పనితీరు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.

కేవలం ఒళ్లు నొప్పులు లేదా అలసట అనిపించినంత మాత్రాన సొంతంగా విటమిన్ డి టాబ్లెట్లు వాడటం సరికాదు. వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష ద్వారా లోపాన్ని నిర్ధారించుకున్న తర్వాతే సప్లిమెంట్లు తీసుకోవాలి. వైద్యులు సూచించిన నిర్దిష్ట కాలపరిమితి, ఖచ్చితమైన మోతాదును మాత్రమే పాటించాలి. ఎక్కువ డోస్ వేసుకుంటే వేగంగా ఫలితం ఉంటుందనుకోవడం పొరపాటు. సరైన వ్యక్తికి, సరైన మోతాదులో, సరైన కాలం పాటు ఇచ్చినప్పుడే విటమిన్ డి సురక్షితంగా పనిచేస్తుంది.

విటమిన్ డి లోపాన్ని సహజ పద్ధతుల్లో అధిగమించడానికి సూర్యరశ్మి అతిపెద్ద సహజ వనరు. రోజూ ఎండలో కాసేపు ఉండటం వల్ల చర్మం సహజంగానే విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. ఆహార విషయానికి వస్తే కొవ్వు చేపలు, గుడ్డులోని పచ్చసొన, లివర్, జున్ను, నెయ్యి, పుట్టగొడుగులు, విటమిన్ డి ఫోర్టిఫై చేసిన ఆహారాలను తీసుకోవడం ద్వారా సహజసిద్ధంగా ఎముకలను దృఢంగా ఉంచుకోవచ్చు.

Tags: