Boost Platelet Count: ప్లేట్‌లెట్స్ సంఖ్య పెంచే అద్భుతమైన పండ్లు ఇవే..
అద్భుతమైన పండ్లు ఇవే..
Boost Platelet Count: వర్షాకాలం వచ్చిందంటే చాలు ఫ్లూ, డెంగీ, టైఫాయిడ్ వంటి అనేక సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెడుతుంటాయి. వీటిలో డెంగీ జ్వరం అత్యంత భయానకమైనది. ఎందుకంటే ఈ జ్వరం వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య ఒక్కసారిగా పడిపోతుంది. డెంగీతో పాటు మలేరియా లేదా ఇతర ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు కూడా ఈ పరిస్థితి ఎదురవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఇలాంటి సమయాల్లో సరైన మందులతో పాటు పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. ఈ పరిస్థితుల్లో కొన్ని పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా సహజంగా ప్లేట్‌లెట్స్ సంఖ్యను పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
బొప్పాయి
బొప్పాయి పండులో మాత్రమే కాకుండా దాని ఆకుల్లో కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డెంగీ జ్వరం వచ్చినప్పుడు పచ్చి బొప్పాయి ముక్కలు తినడం లేదా ఖాళీ కడుపుతో లేత బొప్పాయి ఆకుల రసం తాగడం వల్ల ప్లేట్‌లెట్స్ కౌంట్‌లో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. 2019లో ఫ్రాంటియర్స్ ఇన్ పీడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, డెంగీతో బాధపడుతున్న పిల్లలకు బొప్పాయి ఆకుల రసం ఇవ్వడం వల్ల వారి ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరిగిందని కనుగొన్నారు.
దానిమ్మ
దానిమ్మ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో పాటు ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గకుండా ఉంటుంది. రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
కివి
కివి పండులో ప్రొటీన్, కాల్షియం, పొటాషియంతో పాటు విటమిన్ సి, కె, ఇ సమృద్ధిగా ఉంటాయి. రక్తహీనత, బి-విటమిన్ లోపం లేదా వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు రోజుకు రెండు కివి పండ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డెంగీ జ్వరం వచ్చినప్పుడు కివి తినడం వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోకుండా కాపాడుకోవచ్చు.
డ్రాగన్ ఫ్రూట్
డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్లు, లైకోపీన్, ఐరన్ శాతం అధికంగా ఉంటాయి. ఇవి డెంగీ వ్యాధి తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి. ఎరుపు రంగు డ్రాగన్ ఫ్రూట్ తొక్కతో చేసిన పెరుగును తినడం వల్ల హీమోగ్లోబిన్, ప్లేట్‌లెట్ల సంఖ్య పెరిగినట్లు ఎలుకలపై చేసిన పరిశోధనలో తేలింది.
జామ
అందరికీ అందుబాటులో ఉండే జామ పండులో విటమిన్ సి, ఐరన్, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఎర్ర రక్త కణాల నిర్మాణానికి కూడా తోడ్పడతాయి. కాబట్టి, డెంగీ సోకినప్పుడు జామ పండు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
ఈ పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ప్లేట్‌లెట్స్ సంఖ్యను పెంచుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.