Vegetables Should Not Be Cooked: ఈ కూరగాయలను ఉడికించి కాదు.. పచ్చిగా తింటేనే అద్భుత ఫలితాలు
పచ్చిగా తింటేనే అద్భుత ఫలితాలు
Vegetables Should Not Be Cooked: సాధారణంగా కూరగాయలను ఉడికించి తినడం వల్ల హానికరమైన పదార్థాలు నశించి, సురక్షితంగా, సులభంగా జీర్ణమవుతాయని మనకు తెలుసు. అయితే కొన్ని ప్రత్యేకమైన కూరగాయలను ఉడికించకుండా పచ్చిగా తింటే మరిన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటిని పచ్చిగా తీసుకోవడం వల్ల వాటిలోని ముఖ్యమైన పోషకాలు చెక్కుచెదరకుండా శరీరానికి అందుతాయి. పచ్చిగా తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు అందించే ఆ కూరగాయలు, వాటి లాభాలు గురించి తెలుసుకుందాం..
ఎర్ర క్యాప్సికమ్
ఎర్ర క్యాప్సికమ్‌లు పోషకాలకు నిలయం. వీటిలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. కానీ, వీటిని ఉడికించడం లేదా వేయించడం వల్ల విటమిన్ సి శాతం గణనీయంగా తగ్గుతుంది. అందుకే, వీటిని సలాడ్లలో లేదా ఇతర రూపాల్లో పచ్చిగా తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
బ్రోకలీ
బ్రోకలీలో గ్లూకోరాఫనిన్ అనే ముఖ్యమైన సమ్మేళనం ఉంటుంది. దీనికి శోథ నిరోధక, క్యాన్సర్‌ను నిరోధించే భావాలు ఉన్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ గ్లూకోరాఫనిన్, శక్తివంతమైన సల్ఫోరాఫేన్‌గా మారడానికి మైరోసినేస్ అనే ఎంజైమ్ అవసరం. ఈ ఎంజైమ్ పచ్చి బ్రోకలీలో పుష్కలంగా ఉంటుంది.. కానీ ఉడికించినప్పుడు నాశనమవుతుంది. కాబట్టి, బ్రోకలీని ఉడికించిన దానికంటే పచ్చిగా తినడం ఉత్తమం.
వెల్లుల్లి
పచ్చి వెల్లుల్లిని దంచినప్పుడు లేదా చిన్న ముక్కలుగా తరిగినప్పుడు అల్లినేస్ అనే ఎంజైమ్ చర్య వలన ఇది అల్లిసిన్‌గా మారుతుంది. అల్లిసిన్ అనేది యాంటీమైక్రోబయల్, గుండె ఆరోగ్యానికి తోడ్పడే అద్భుతమైన సమ్మేళనం. వెల్లుల్లిని నేరుగా తినడం కష్టంగా అనిపిస్తే, దానిని తేనెతో కలిపి తీసుకోవచ్చు. అయితే పచ్చి వెల్లుల్లి కొందరిలో కడుపు సంబంధిత సమస్యలను పెంచవచ్చు. కాబట్టి దీనిని అధికంగా తీసుకునే ముందు నిపుణుడి సలహా తీసుకోవడం శ్రేయస్కరం.
ఉల్లిపాయ
ఉల్లిపాయలు సాధారణంగా క్వెర్సెటిన్, సల్ఫర్ కలిగిన సమ్మేళనాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను, గుండెకు మేలు చేసే ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వాటిని ఎక్కువసేపు ఉడికించడం వల్ల ఈ ముఖ్యమైన సమ్మేళనాలు, కొన్ని ఫ్లేవనాయిడ్లు దెబ్బతింటాయి లేదా తగ్గుతాయి. కాబట్టి ఉల్లిపాయలను కూడా పచ్చిగా సలాడ్లలో లేదా పచ్చళ్లలో చేర్చుకోవడం ద్వారా వాటి పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఈ కూరగాయలను పచ్చిగా తీసుకోవడం వలన వాటిలోని కీలకమైన పోషకాలను, ఎంజైమ్‌లను గరిష్టంగా పొందవచ్చు. మీ దైనందిన ఆహారంలో వీటిని భాగం చేసుకోండి. అదనపు ఆరోగ్య ప్రయోజనాలను పొందండి!