Relieve Constipation: మలబద్ధకం ఉంటే..ఈ టిప్స్ పాటించండి
ఈ టిప్స్ పాటించండి
Relieve Constipation: నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చాలామందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య 'మలబద్ధకం'. చాలామంది దీనిని సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ, వైద్యశాస్త్రం ప్రకారం.. వారానికి మూడు కంటే తక్కువ సార్లు విసర్జన అవుతుంటే దానిని మలబద్ధకంగా పరిగణించాలి. ఈ సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే, అది తీవ్రమైన 'పైల్స్' (అర్శమొలలు) వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.
మలబద్ధకాన్ని దూరం చేసుకోవాలంటే మన ఆహారంలో పీచు పదార్థం (Fiber) పుష్కలంగా ఉండాలి. మీరు తీసుకునే భోజనంలో పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, చిక్కుళ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా అవిసె గింజలు, సబ్జా గింజలు వంటివి జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే, ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే 'యోగర్ట్' లేదా పెరుగును తీసుకోవడం వల్ల పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది విసర్జన సాఫీగా జరుగుతుంది.
కేవలం ఆహారం మాత్రమే కాదు.. శరీరానికి సరిపడా నీరు అందడం కూడా అంతే ముఖ్యం. ప్రతిరోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగాలి. నీరు తక్కువైతే మలం గట్టిపడి విసర్జన కష్టమవుతుంది. వీటితో పాటు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. క్రమశిక్షణ. ప్రతిరోజూ ఒకే సమయానికి కాలకృత్యాలు తీర్చుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మన శరీరంలోని 'బయోలాజికల్ క్లాక్' క్రమబద్ధం అవుతుంది.ఆరోగ్యకరమైన ఆహారం, సరైన వ్యాయామం, తగినంత విశ్రాంతి ఉంటే మలబద్ధకం వంటి సమస్యలను సులభంగా జయించవచ్చు.