Troubled by Mouth Ulcers: నోటి పూతలతో ఇబ్బంది పడుతున్నారా? పదేపదే వస్తుంటే ప్రాణాంతక వ్యాధి కావచ్చు..
పదేపదే వస్తుంటే ప్రాణాంతక వ్యాధి కావచ్చు..
Troubled by Mouth Ulcers: చాలామంది ఏదైనా కారంగా తిన్నప్పుడు లేదా కడుపులో అసౌకర్యంగా ఉన్నప్పుడు నోటి పూతలను గమనిస్తుంటారు. ఇవి సాధారణంగా వచ్చి ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుంటాయి. కానీ మీకు తరచుగా నోటి పూతలు వస్తున్నాయా? లేదా ఒక్కసారి వచ్చిన పూత నెల రోజులైనా తగ్గడం లేదా? అయితే మీరు వెంటనే అప్రమత్తం కావాలి. ఎందుకంటే ఇది కేవలం వేడి వల్ల వచ్చేది కాకపోవచ్చు, లోపల ఉన్న ఏదో పెద్ద అనారోగ్యానికి ఇది ఒక ముందస్తు హెచ్చరిక కావచ్చు.
ఎందుకు వస్తాయి? సాధారణ కారణాలు ఇవే..
శరీరంలో పోషకాల లోపం వల్ల నోటి పూతలు రావడం సర్వసాధారణం.
ఐరన్, ఫోలిక్ యాసిడ్ లోపం.
శరీరంలో విటమిన్ బి12 స్థాయిలు తగ్గడం.
విపరీతమైన కారంగా ఉండే ఆహారం తీసుకోవడం.
జీర్ణక్రియ సంబంధిత సమస్యలు.
ఎప్పుడు ప్రమాదకరంగా మారుతాయి?
సాధారణ పూతలు కొద్దిరోజుల్లో నయమవుతాయి. కానీ కింది లక్షణాలు ఉంటే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి:
నెల రోజులైనా తగ్గని పూత: నోటిలో వచ్చిన అల్సర్ నెల రోజులు గడిచినా తగ్గకపోతే అది నోటి క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది.
తరచుగా రావడం: ప్రతి నెలా పూతలు రావడం, నోటి నుండి స్వల్పంగా రక్తస్రావం కావడం.
బరువు తగ్గడం: నోటి పూతలతో పాటు హఠాత్తుగా బరువు తగ్గడం.
ఇతర వ్యాధులు: థైరాయిడ్ సమస్యలు, మధుమేహం, పేగు వ్యాధులు లేదా కొన్ని సందర్భాల్లో HIV వైరస్ ప్రభావం వల్ల కూడా నోటి పూతలు పదేపదే వస్తుంటాయి.
ఎవరికి ముప్పు ఎక్కువగా ఉంటుంది?
పొగాకు ఉత్పత్తులు వాడేవారు, ధూమపానం చేసేవారు.
తీవ్రమైన మధుమేహం ఉన్న రోగులు.
విటమిన్ బి12 లోపంతో బాధపడేవారు.
నిరంతరం జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు.
నివారణ మార్గాలు ఇవే: ఇలా జాగ్రత్త పడండి
నోటి పూతలు దరిచేరకూడదంటే కింది నియమాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు:
నోటి పరిశుభ్రత: ప్రతిరోజూ నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
ఆహార నియమాలు: మరీ ఎక్కువ కారం, మసాలా ఉన్న ఆహార పదార్థాలను తగ్గించాలి.
చెడు అలవాట్లకు దూరం: ధూమపానం, పొగాకు వాడకం పూర్తిగా మానేయాలి.
పరీక్షలు: తరచుగా పూతలు వస్తుంటే రక్త పరీక్ష చేయించుకుని విటమిన్ బి12, ఐరన్ స్థాయిలను తనిఖీ చేసుకోవాలి.
నోటి పూత అనేది ఒక చిన్న సమస్యలా కనిపించినా, అది మీ శరీరంలో ఉన్న పెద్ద అనారోగ్యానికి అద్దం పట్టవచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో స్పందించండి.