Heart Attack Risk: తెలిసి తెలియక చేసే పొరపాట్లతో గుండెపోటు ముప్పు.. హెచ్చరిస్తున్న సీనియర్ వైద్యులు..

హెచ్చరిస్తున్న సీనియర్ వైద్యులు..

Update: 2026-07-25 11:49 GMT

Heart Attack Risk: నేటి ఆధునిక జీవనశైలిలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో హై కొలెస్ట్రాల్ ఒకటి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి, రక్త ప్రసరణకు అవరోధం ఏర్పడుతుంది. ఇది క్రమంగా గుండెపోటు, స్ట్రోక్‌లకు దారితీస్తుంది. అత్యంత ప్రమాదకరమైన విషయమేమిటంటే.. కొలెస్ట్రాల్ ఏ క్షణంలో పెరుగుతుందో స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే వైద్యులు దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఒక్కరోజులో పెరగదని, ప్రతిరోజూ మనం చేసే కొన్ని తప్పుడు అలవాట్లే దీనికి కారణమని ఢిల్లీలోని శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్ ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ అమర్ సింఘాల్ వెల్లడించారు. కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే ఆ ప్రమాదకరమైన అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ పెరగడానికి దారితీసే రోజూవారీ తప్పులు:

సరికాని ఆహారపు అలవాట్లు:

మైదాతో చేసిన పదార్థాలు, నూనెలో తీవ్రంగా వేగించిన ఫ్రైలు, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్‌ ఎక్కువగా తినడం.

కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన స్వీట్ డ్రింక్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం.

శారీరక శ్రమ లేకపోవడం:

గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం, కనీస వ్యాయామం లేదా నడక లేకపోవడం వల్ల కొవ్వు కరగకుండా రక్తంలో చేరుతుంది.

జీవనశైలి లోపాలు:

అధిక బరువు, ధూమపానం విపరీతంగా మద్యం సేవించడం.

రోజుకు సరిపడా నిద్ర లేకపోవడం కూడా కొలెస్ట్రాల్ అసమతుల్యతకు కారణమవుతుంది.

ఇతర ఆరోగ్య సమస్యలు - జన్యుపరమైన అంశాలు:

డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారిలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఎక్కువ. కుటుంబంలో ఎవరికైనా కొలెస్ట్రాల్ సమస్య ఉంటే జన్యుపరంగా కూడా ఇది సంక్రమించవచ్చు.

కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం ఎలా?

రోజూ 30 నిమిషాల వ్యాయామం:

ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్, యోగా లేదా ఇతర శారీరక వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి.

ఆరోగ్యకరమైన ఆహారం:

ఆయిల్, స్వీట్స్ తగ్గించి పీచు పదార్థాలు, తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

క్రమం తప్పకుండా హెల్త్ చెకప్:

కొలెస్ట్రాల్‌కు ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు ఉండవు కాబట్టి, ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం సురక్షితం.

బరువు నియంత్రణ:

శరీర బరువును అదుపులో ఉంచుకోవడమే కాకుండా, డాక్టర్ సలహా మేరకు సరైన జీవనశైలి మార్పులు, మందులు వాడాలి.

సమయానికి స్పందించి మన అలవాట్లను మార్చుకుంటే కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రించి, గుండెను పదిలంగా కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News