Urinary Tract Infections: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్: మహిళల్లోనే ఈ సమస్య ఎందుకు ఎక్కువ? లక్షణాలు, ప్రమాదాలు ఇవే..
లక్షణాలు, ప్రమాదాలు ఇవే..
Urinary Tract Infections: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ ఒకటి. స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఇది కనిపించినప్పటికీ, గణాంకాల ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళలే దీని బారిన ఎక్కువగా పడుతున్నారు. ప్రారంభంలో సాధారణ సమస్యగానే కనిపించినా, సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఎందుకు వస్తుంది?
మహిళల శారీరక నిర్మాణమే వారికి ఈ ఇన్ఫెక్షన్ త్వరగా సోకడానికి ప్రధాన కారణం.
శరీర నిర్మాణం: పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రనాళం పొడవు చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మలద్వారం, మూత్రనాళ ద్వారం దగ్గరగా ఉండటం వల్ల బ్యాక్టీరియా (ముఖ్యంగా ఈ-కోలి సులభంగా మూత్రాశయంలోకి చేరుతుంది.
హార్మోన్ల మార్పులు - మెనోపాజ్: మెనోపాజ్ దశలో మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది మూత్ర మార్గంలోని సహజ రక్షణ వ్యవస్థను బలహీనపరిచి, ఇన్ఫెక్షన్ల ముప్పును పెంచుతుంది.
గర్భధారణ సమయం: గర్భిణులలో పెరుగుతున్న గర్భాశయం మూత్రాశయంపై ఒత్తిడి తెస్తుంది. దీనివల్ల మూత్రం పూర్తిగా బయటకు వెళ్లక, నిల్వ ఉన్న మూత్రంలో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది.
ఇతర కారణాలు: నిర్దిష్ట గర్భనిరోధక సాధనాలు వాడటం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం మరియు లైంగిక సంపర్కం వల్ల కూడా బ్యాక్టీరియా వ్యాపించే అవకాశాలు ఎక్కువ.
లక్షణాలు ఎలా ఉంటాయి?
యూటీఐ సోకినప్పుడు శరీరంలో కనిపించే ప్రధాన మార్పులు..
మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన మంట లేదా నొప్పి.
మూత్రం కొద్దికొద్దిగానే వచ్చినప్పటికీ, మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సి రావడం.
పొత్తికడుపులో లేదా నడుము కింది భాగంలో తీవ్రమైన నొప్పి, తిమ్మిరి.
మూత్రం రంగు మారడం, దుర్వాసన రావడం. తీవ్రత ఎక్కువైతే మూత్రం గులాబీ లేదా ఎరుపు రంగులో రావడం.
నీరసం, అలసట ఆవరించడం.
కిడ్నీలకు వ్యాపిస్తే మరింత ప్రమాదం
యూటీఐని నిర్లక్ష్యం చేస్తే బ్యాక్టీరియా మూత్రాశయం నుంచి మూత్రపిండాల వరకు చేరుతుంది . ఆ సమయంలో:
వణుకుతో కూడిన అధిక జ్వరం
వీపు పైభాగంలో లేదా పక్కటెముకల కింద విపరీతమైన నొప్పి
నిరంతర వికారం, వాంతులు వంటి ప్రమాదకర లక్షణాలు కనిపిస్తాయి.
నివారణకు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు
తగినంత నీరు తాగడం: రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల మూత్రం ద్వారా బ్యాక్టీరియా సహజంగానే బయటకు వెళ్లిపోతుంది.
మూత్రాన్ని ఆపుకోకూడదు: మూత్ర విసర్జనను ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల బ్యాక్టీరియా వేగంగా విస్తరిస్తుంది.
వ్యక్తిగత పరిశుభ్రత: వాష్‌రూమ్ ఉపయోగించిన తర్వాత ముందరి భాగం నుంచి వెనుక వైపునకు శుభ్రం చేసుకోవాలి. వెనుక నుంచి ముందుకు చేయడం వల్ల మలద్వారం వద్ద ఉండే బ్యాక్టీరియా మూత్రనాళానికి సోకే ప్రమాదం ఉంది.
లైంగిక సంపర్కం తర్వాత: శృంగారం ముగిసిన వెంటనే మూత్ర విసర్జన చేయడం వల్ల ప్రవేశించిన బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది.
సహజ కాటన్ లోదుస్తులు: గాలి ఆడే కాటన్ దుస్తులను ధరించడం, బిగుతుగా ఉండే సింథటిక్ వస్త్రాలను నివారించడం మేలు.
వైద్య సలహా ఎప్పుడు అవసరం?
మూత్రంలో మంట, పొత్తికడుపు నొప్పి వంటి ప్రాథమిక లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి యూరిన్ కల్చర్ పరీక్ష చేయించుకోవాలి. వైద్యులు సూచించిన యాంటీబయాటిక్స్ కోర్సును మధ్యలోనే ఆపకుండా పూర్తిగా వాడటం ద్వారా ఇన్ఫెక్షన్ మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా అడ్డుకోవచ్చు.