Sharper Brain: మెదడు షార్ప్‌గా పనిచేయాలంటే.. కేవలం మెదడుకు వ్యాయామం చేయడం, పజిల్స్ సాల్వ్ చేయడం మాత్రమే కాదు.. మనం రోజూ తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నరాల ఆరోగ్యానికి కొన్ని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే మన రోజువారీ డైట్‌లో కొన్ని ఆహారాలను చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి మేలు చేసే ఐదు ఆహారాలు

మొదటిది.. వాల్‌నట్స్. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపు వంటి వాటి నుంచి రక్షించడంలో సహాయపడతాయి. జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.

రెండోది.. గుడ్లు. గుడ్లలో ప్రొటీన్‌తో పాటు కోలిన్ అనే ముఖ్యమైన పోషకం ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తి, నేర్చుకునే ప్రక్రియకు అవసరమైన ఎసిటైల్‌కోలిన్ అనే రసాయనం తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది.

మూడోది.. కొవ్వు చేపలు. ముఖ్యంగా సాల్మన్ వంటి చేపల్లో DHA, EPA రూపంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిలోని DHA మెదడు కణాల నిర్మాణం, నరాల పనితీరుకు ఎంతో కీలకం.

నాలుగోది.. గుమ్మడి గింజలు. వీటిలో మెగ్నీషియం, జింక్, కాపర్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, నరాల మధ్య సంకేతాలు సరిగ్గా ప్రసారం కావడానికి సహకరిస్తాయి.

ఇక ఐదోది.. బెర్రీలు. వీటిలో పాలిఫెనాల్స్, ఆంథోసయనిన్లు వంటి యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మెదడులో ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపును తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి మందగించే ప్రక్రియను నెమ్మదించడంలో కూడా ఇవి ఉపయోగపడవచ్చు.

అయితే ఒక్క ఆహారంతోనే మెదడు ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడదు. సమతుల్యమైన ఆహారం, తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడిని నియంత్రించుకోవడం కూడా అంతే ముఖ్యం.

కాబట్టి మెదడు చురుగ్గా, ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పోషక విలువలున్న ఆహారాలను మీ రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు

Tags: