Warning for Fitness Enthusiasts: ఫిట్నెస్ ప్రియులకు హెచ్చరిక.. అధిక ప్రోటీన్ షేక్‌లు తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు
ఈ సమస్యలు తప్పవు
Warning for Fitness Enthusiasts: జిమ్‌కు వెళ్లేవారు, బరువు తగ్గాలనుకునేవారు లేదా ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టేవారు సాధారణంగా ప్రోటీన్ షేక్‌లను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. అయితే శరీర అవసరానికి మించి ఒకేసారి చిక్కటి ప్రోటీన్ షేక్‌లు తాగడం లేదా అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేయడానికి కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం అధికంగా ఉత్పత్తి కావడమే ఇందుకు ప్రధాన కారణం. కండరాల పుష్టికి, కణజాలాల పునరుద్ధరణకు ప్రోటీన్ ఎంత ముఖ్యమో, అది సరిగ్గా జీర్ణం కావడం కూడా అంతే అవసరం. ఆహారంలో తగినంత ఫైబర్ లేకపోవడం, జీర్ణ ఎంజైమ్‌ల లోపం వల్ల ప్రోటీన్ సరిగ్గా ఒంటబట్టదు.
శరీరం ప్రోటీన్‌ను జీర్ణం చేసుకోలేకపోతోందని తెలిపే 5 ముఖ్య సంకేతాలు:
కడుపు ఉబ్బరం - గ్యాస్: ప్రోటీన్ తీసుకున్న వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపించడం లేదా అధికంగా గ్యాస్ విడుదల కావడం జీర్ణవ్యవస్థ బలహీనతను సూచిస్తుంది.
కండరాల నొప్పులు - బలహీనత: ఆహారంలో ప్రోటీన్ ఉన్నప్పటికీ, అది శరీరానికి అందకపోతే కండరాలు బలహీనపడి తరచూ తిమ్మిర్లు, నొప్పులు వస్తాయి.
ఆకలి మందగించడం - బరువు తగ్గడం: పోషకాలు శరీరానికి సరిగ్గా అందక తగినంత శక్తి లేకపోవడం వల్ల నిరంతరం నీరసం, ఆకలి లేకపోవడం జరుగుతుంది.
గాయాలు ఆలస్యంగా మానడం: చిన్న గాయాలు కూడా మానడానికి ఎక్కువ సమయం పడుతుంటే, ప్రోటీన్ శోషణ సరిగ్గా లేదని అర్థం.
జుట్టు రాలడం, గోళ్లు విరగడం: ప్రోటీన్ కొరత వల్ల చర్మం పొడిబారడం, గోళ్లు చిట్లడం, జుట్టు రాలిపోవడం వంటి మార్పులు కనిపిస్తాయి.
జీర్ణక్రియ మెరుగుపడటానికి నిపుణులు ఇచ్చే చిట్కాలు
సమతుల్య ఆహారం: ప్లేట్‌లో ప్రోటీన్‌తో పాటు తగినంత ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఉండేలా పప్పులు, పెరుగు, సలాడ్లను చేర్చుకోండి.
చిన్న మోతాదుల్లో తీసుకోండి: ఒకేసారి భారీగా కాకుండా, రోజంతా తక్కువ మోతాదుల్లో విభజించి ఆహారం తీసుకోండి.
నిదానంగా తాగండి-తినండి: ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ప్రోటీన్ షేక్‌లను గుటకలు వేస్తూ నిదానంగా తాగాలి.
నీటి సమయం పాటించండి: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగకుండా, కనీసం 45 నిమిషాల నుంచి గంట తర్వాత మాత్రమే తాగాలి.
ప్రాసెస్డ్ ప్రోటీన్ పరిమితం చేయండి: సహజసిద్ధమైన ఆహార వనరుల నుంచి వచ్చే ప్రోటీన్‌కు ప్రాధాన్యత ఇవ్వండి.