Brain During Cardiac Arrest: గుండెపోటు రాగానే మనకు గుర్తుకొచ్చే మొదటి విషయం... గుండె గురించే! కానీ, గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు, ఆ ప్రమాదం నేరుగా మన మెదడుపైనే పడుతుంది. కార్డియాలజిస్ట్ లు చెబుతున్న దాని ప్రకారం... కార్డియాక్ అరెస్ట్ అనేది కేవలం గుండెకు సంబంధించిన అత్యవసర పరిస్థితి మాత్రమే కాదు, అది ఒక 'మెదడుకు సంబంధించిన ప్రాణాంతక అత్యవసర పరిస్థితి' కూడా

గుండె ఆగిపోగానే, మెదడుకు రక్త సరఫరా క్షణాల్లో నిలిచిపోతుంది. ఆక్సిజన్ అందక మెదడు కణాలు సెకన్ల వ్యవధిలోనే పనిచేయడం మానేస్తాయి. సరిగ్గా 10 నుంచి 20 సెకన్లలోనే వ్యక్తి స్పృహ కోల్పోయి కుప్పకూలిపోతాడు. ఇక్కడ చాలా మందికి వచ్చే సందేహం... 'హార్ట్ అటాక్'కి, 'కార్డియాక్ అరెస్ట్'కి తేడా ఏంటి అని?హార్ట్ అటాక్‌లో గుండెకు రక్తనాళాలు పూడుకుపోయినా, గుండె కొంతవరకు పనిచేస్తూ మెదడుకు ఆక్సిజన్‌ను అందిస్తుంది. కానీ 'కార్డియాక్ అరెస్ట్'లో పరిస్థితి పూర్తిగా భిన్నం. ఇక్కడ గుండె ఒక్కసారిగా పంపింగ్ ఆపేస్తుంది. దాంతో మెదడుకు అందాల్సిన రక్తప్రసరణ పూర్తిగా నిలిచిపోతుంది.

ఇలాంటి క్లిష్టమైన సమయంలో ప్రతి సెకను చాలా విలువైనది!మెదడు ఆక్సిజన్ లేకుండా ఎంత ఎక్కువ సమయం ఉంటుందో, శాశ్వత మెదడు నష్టం (Brain Damage) జరిగే ప్రమాదం అంత ఎక్కువగా పెరుగుతుంది. ఒకవేళ ప్రాణాలతో బయటపడినప్పటికీ.. కొందరిలో జ్ఞాపకశక్తి మందగించడం, మాట తడబడటం, గందరగోళం లేదా మూర్ఛల వంటి దీర్ఘకాలిక సమస్యలు వెంటాడవచ్చు.

అందుకే డాక్టర్లు హెచ్చరిస్తున్నారు... ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలి, సాధారణంగా శ్వాస తీసుకోకపోతే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు! వెంటనే అత్యవసర వైద్య సహాయానికి (Ambulance) కాల్ చేయాలి. ఆలస్యం చేయకుండా CPR (కార్డియోపల్మనరీ రిససిటేషన్) ప్రారంభించాలి. వీలైతే వెంటనే AED (ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డిఫిబ్రిలేటర్) పరికరాన్ని ఉపయోగించాలి. వైద్యులు వచ్చే వరకు CPR చేయడం వల్ల మెదడుకు, ఇతర కీలక అవయవాలకు కొంతమేర రక్తప్రసరణ అంది ప్రాణాలు దక్కే అవకాశాలు పెరుగుతాయి.

Tags: