Cancer: క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయాన్ని తప్పించవచ్చని వైద్య నిపుణులు నిరంతరం చెబుతుంటారు. శరీరంలో ఏవైనా అసాధారణ మార్పులు కనిపించినప్పుడు లేదా క్యాన్సర్ ఉందేమోనన్న అనుమానం వచ్చినప్పుడు సరైన వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం. ప్రారంభ దశలో వ్యాధిని నిర్ధారించడానికి వైద్యులు సూచించే కీలక పరీక్షల వివరాలు ఇక్కడ చూద్దాం.

బయాప్సీ – ఖచ్చితమైన నిర్ధారణ

క్యాన్సర్ నిర్ధారణలో బయాప్సీ అత్యంత కీలకమైన పరీక్ష. శరీరంలో గడ్డలు లేదా అనుమానిత కణజాలం (టిష్యూ) నుంచి చిన్న భాగాన్ని సేకరించి ల్యాబ్‌లో మైక్రోస్కోప్ ద్వారా పరీక్షిస్తారు. కణాలు సాధారణమైనవా లేక క్యాన్సర్ కణాలా అనే విషయాన్ని ఇది నూటికి నూరు శాతం స్పష్టం చేస్తుంది.

ఇమేజింగ్ పరీక్షలు

శరీరం లోపలి భాగాలలో కణితులు, మార్పులను గుర్తించడానికి వివిధ రకాల ఇమేజింగ్ పరీక్షలు చేస్తారు.

మమోగ్రఫీ : రొమ్ము క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించడానికి చేసే ప్రత్యేక ఎక్స్-రే పరీక్ష.

సిటీ స్కాన్ - ఎంఆర్ఐ : శరీర అంతర్గత అవయవాలు, మెదడు, ఊపిరితిత్తులు, ఉదర భాగాలలో కణితుల పరిమాణం మరియు విస్తరణను స్పష్టంగా చూపిస్తాయి.

పెట్ స్కాన్ : క్యాన్సర్ కణాలు శరీరంలో ఎక్కడెక్కడ చురుగ్గా ఉన్నాయో, ఎంతవరకు వ్యాపించాయో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

అల్ట్రాసౌండ్: థైరాయిడ్, కాలేయం, గర్భాశయం వంటి భాగాల్లోని నీటి బుడగలు, గడ్డలను గుర్తించడానికి చేస్తారు.

రక్త పరీక్షలు - ట్యూమర్ మార్కర్స్

కంప్లీట్ బ్లడ్ కౌంట్: తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లెట్ల సంఖ్యను బట్టి బ్లడ్ క్యాన్సర్ (లుకేమియా) వంటి వాటిపై ప్రాథమిక అవగాహన వస్తుంది.

ట్యూమర్ మార్కర్స్: క్యాన్సర్ కణాలు విడుదల చేసే కొన్ని రకాల ప్రొటీన్లను గుర్తించే రక్త పరీక్షలు.

PSA: ప్రొస్టేట్ క్యాన్సర్ నిర్ధారణకు.

CA-125: అండాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌కు.

CEA, AFP: పెద్దపేగు, కాలేయ క్యాన్సర్ల పర్యవేక్షణకు.

పాప్ స్మియర్ - హెచ్‌పీవీ టెస్ట్

మహిళల్లో సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్‌ను నివారించడానికి, ముందస్తుగా గుర్తించడానికి ఈ పరీక్షలు ఎంతో కీలకం.

గర్భాశయ ముఖద్వారం వద్ద కణాలలో వచ్చే మార్పులను ఇది ముందే పసిగడుతుంది.

ఎండోస్కోపీ - కొలనోస్కోపీ

ఆహారవాహిక, జీర్ణాశయం, ప్రేగులలో సమస్యలు ఉన్నప్పుడు చిన్న కెమెరాతో కూడిన గొట్టం ద్వారా అంతర్గత భాగాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తారు.

కణితి కనిపిస్తే అక్కడికక్కడే బయాప్సీ కోసం శాంపిల్ తీసుకునే వీలుంటుంది.

ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?

అకారణంగా బరువు తగ్గడం.

తగ్గని దగ్గు, గొంతు బొంగురుపోవడం లేదా మింగడంలో ఇబ్బంది.

శరీరంలో ఎక్కడైనా కొత్తగా గడ్డలు ఏర్పడటం.

మల, మూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు లేదా రక్తస్రావం.

Tags: