Link Between Obesity and Cancer: బరువుకి, క్యాన్సర్‌కి లింక్ ఏంటి?..యువతను భయపెడుతున్న కొత్త పరిశోధనలు!

యువతను భయపెడుతున్న కొత్త పరిశోధనలు!

Update: 2026-05-19 03:24 GMT

Link Between Obesity and Cancer: ఒకప్పుడు ఊబకాయం లేదా ఒబెసిటీ అంటే... కేవలం ముప్పై, నలభై ఏండ్లు దాటిన మధ్య వయస్కుల్లో వచ్చే సమస్యగానే భావించేవాళ్లు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మారుతున్న జీవనశైలి, జంక్ ఫుడ్ సంస్కృతి కారణంగా... కొందరు ఇరవై ఏండ్లు నిండకుండానే బరువులో సెంచరీ మార్కును దాటేస్తున్నారు.

అయితే, చాలామంది ఈ అధిక బరువును కేవలం లుక్స్ లేదా ఫిట్‌నెస్‌ సమస్యగానే చూస్తారు. లావుగా ఉంటే అందంగా కనిపించమేమో అనుకుంటారు తప్ప... దీని వెనుక దాగున్న అసలు ప్రమాదాన్ని గుర్తించరు. యుక్త వయసులో పెరిగే ఈ అధిక బరువు... భవిష్యత్తులో ప్రాణాంతక క్యాన్సర్లకూ కారణమవుతోందని ఈమధ్య వచ్చిన అంతర్జాతీయ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

ఇంతకీ బరువుకి, క్యాన్సర్‌కి ఉన్న సంబంధం ఏంటి? శాస్త్రవేత్తల ప్రకారం... శరీరంలో కొవ్వు కణాలు (Fat cells) కేవలం శక్తిని నిల్వ చేసేవి మాత్రమే కాదు, అవి నిరంతరం హార్మోన్లు, రసాయనాలను విడుదల చేస్తూ ఉంటాయి. శరీరంలో కొవ్వు మోతాదుకు మించి పెరిగినప్పుడు... అది ‘క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్’ అంటే లోపల దీర్ఘకాలిక వాపుకు దారితీస్తుంది. ఈ ప్రక్రియ వల్ల శరీరంలోని కణాల DNA దెబ్బతిని, అవి క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం పెరుగుతుంది.

అంతేకాదు, ఊబకాయం వల్ల ఇన్సులిన్ స్థాయిలు అదుపు తప్పుతాయి. ఇది ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా యుక్త వయసు నుంచే లావుగా ఉండటం వల్ల... భవిష్యత్తులో పేగు క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో పాటు మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.

అందుకే... ఊబకాయాన్ని కేవలం శారీరక రూపానికి సంబంధించిన సమస్యగా లైట్ తీసుకోవద్దు. యుక్త వయసు నుంచే సరైన ఆహార నియమాలు, ప్రతిరోజూ వ్యాయామం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం.

Tags:    

Similar News