హిమాచల్ ప్రదేశ్ కు భారీ వర్ష సూచన
హిమాచల్ ప్రదేశ్ లో ముందు జాగ్రత్తగా రహదారులను అధికారులు మూసివేశారు.;
హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. అనేక చోట్ల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కుండపోత వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా రహదారులను అధికారులు మూసివేశారు. వారం రోజులుగా పడుతున్న వర్షాలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి 69 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 40 మంది గల్లంతయ్యారు. దాదాపు రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. కాంగ్రా, సిర్మౌర్, మండి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఉనా, బిలాస్‌పూర్, హమీర్‌పూర్, చంబా, సోలన్, సిమ్లా, కులు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 260కిపైగా రోడ్లను మూసివేసినట్లు అధికారులు శనివారం తెలిపారు. అందులో మండి జిల్లాలోనే 176 రోడ్లు క్లోజ్ చేసినట్లు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.