Trump’s Double Game : దాడి మొదలైన తర్వాతే అమెరికా నుంచి కాల్... ట్రంప్ డబుల్ గేమ్ వెలుగులోకి!
ట్రంప్ డబుల్ గేమ్ వెలుగులోకి!
Trump’s Double Game : ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల గురించి అమెరికాకు ముందే సమాచారం ఉన్నప్పటికీ, ఖతార్‌కు సమాచారం అందించడంలో ఆలస్యం చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతున్నారనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతోంది.
దాడి తర్వాత 10 నిమిషాలకు కాల్..
ఇజ్రాయెల్ దాడిలో హమాస్ కీలక నేత ఖలీల్ అల్-హయ్యా కుమారుడితో సహా ఆరుగురు మరణించారు. ఈ దాడి గురించి అమెరికాకు ముందుగానే సమాచారం ఇచ్చామని ఇజ్రాయెల్ పేర్కొంది. అమెరికా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. అయితే, దాడులు ప్రారంభమైన 10 నిమిషాల తర్వాతే అమెరికా నుంచి ఖతార్‌కు కాల్ వచ్చిందని ఖతార్ విదేశాంగ శాఖ అధికారి తెలిపారు. పేలుళ్లు జరుగుతుండగా అమెరికా అధికారి నుంచి ఫోన్ వచ్చిందని పేర్కొన్నారు. ఈ దాడి సమయంలో హమాస్ నేతలు అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రతిపాదనను చర్చిస్తున్నారు. ముందుగా సమాచారం తెలిసినప్పటికీ అమెరికా ఎందుకు తక్షణం సమాచారం ఇవ్వలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా-ఖతార్ సంబంధాలు..
ట్రంప్ ఇటీవల మిత్ర దేశాలతో వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత్‌పై భారీ సుంకాలు విధిస్తూ మిత్ర దేశంగా ప్రకటించిన ట్రంప్, ఖతార్‌తో కూడా ఇలాంటి వైఖరిని ప్రదర్శించారు. అమెరికా-ఖతార్ మధ్య సంబంధాలు ఇటీవల బలపడ్డాయి. ఖతార్ నుంచి ట్రంప్ విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా పొందారు. అలాగే, ఖతార్ పర్యటనలో కీలక ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పశ్చిమాసియాలో అమెరికా దౌత్య ప్రయత్నాలకు ఖతార్ కీలక పాత్ర పోషిస్తోంది, ముఖ్యంగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఇలాంటి సమయంలో అమెరికా మిత్ర దేశంపై ఇజ్రాయెల్ దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ దాడులపై అమెరికా స్పందన వివాదాస్పదంగా ఉంది. వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ, దాడి గురించి ఖతార్‌కు సమాచారం అందించాలని ట్రంప్ తమ రాయబారి స్టీవ్ విట్కాఫ్‌ను ఆదేశించారని తెలిపారు. అయితే, ట్రంప్ దాడి గురించి ముందే సమాచారం ఇచ్చామని పేర్కొనగా, ఈ నిర్ణయం తనది కాదని, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీసుకున్నదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగవని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఈ దాడి పూర్తిగా తమ స్వతంత్ర చర్య అని, అమెరికా ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఖతార్‌కు ద్రోహం చేశారని సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.