CENTCOM: ఇరాన్‌పై కొత్త ఆంక్షల వ్యూహం.. సెంట్‌కామ్ ఆదేశం
సెంట్‌కామ్ ఆదేశం
CENTCOM: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా విధించిన షరతులను ఇరాన్ అంగీకరించకపోవడంతో.. టెహ్రాన్‌ను టార్గెట్ చేసేందుకు కొత్త మార్గాలు వెతకాలని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) తన బలగాలకు ఈ-మెయిల్ పంపింది. ఇరాన్‌పై ఒత్తిడి పెంచి అణు కార్యక్రమాలను ఆపేలా చేయడం కోసం వినూత్న, సంప్రదాయేతర సూచనలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఇప్పటివరకు అమలు చేసిన వ్యూహాన్ని పునఃపరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అమెరికా మీడియా వెల్లడించింది.
ఇరాన్‌పై భారీ దాడులు చేపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ జోక్యంతో భీకర దాడుల నుంచి ట్రంప్ వెనక్కి తగ్గారు. అధ్యక్షుడి హెచ్చరికలకు ముందే సెంట్‌కామ్ ఈ-మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. ఇరాన్‌ను మళ్లీ చర్చల బల్లకు తీసుకురావాలని అమెరికా కొన్ని వారాలుగా నిరంతర వైమానిక దాడులు చేస్తూనే ఉంది. అయినా ఒప్పందం కుదిరే సూచనలు లేకపోవడంతో టెహ్రాన్‌ను శిక్షించడంపై ఇప్పుడు దృష్టి సారించినట్లు సమాచారం.
ఒప్పందంపై తుది నిర్ణయానికి రావడానికి ఇరాన్‌కు ‘చివరి అవకాశం’ ఇచ్చామని ట్రంప్ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో చేపట్టిన దాడులకంటే తీవ్రంగా ఇరాన్‌పై విరుచుకుపడేందుకు తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే యుద్ధం ముగింపుకు దౌత్య మార్గాలు అనుసరించాలని ఇరాన్‌తో పాటు సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ చేసిన అభ్యర్థనల మేరకు సైనిక దాడిని నిలిపివేశామన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల ప్రతినిధుల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయని, ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే టెహ్రాన్‌ను వదిలేయడం లేదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా మంగళవారం తెల్లవారుజామున కువైట్, ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఐఆర్‌జీసీ డ్రోన్ దాడులు చేపట్టింది.