THE AMERICA PARTY : కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన ఎలాన్ మస్క్
ది అమెరికా పార్టీ పేరుతో తృతీయ ప్రత్యామ్నాయ పార్టీ;
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నంత పని చేశారు. వన్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు ప్రతినిధుల సభలో ఆమోదం పొందితే ఆ మర్నాడే కొత్త రాజకీయ పార్టీ స్ధాపిస్తానని ప్రకటించారు. ఆయన అన్నట్లుగానే శుక్రవారం అమెరికన్ కాంగ్రెస్ లో వన్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లుకు ఆమోదం లభించడం ఆ బల్లుపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో చట్టంగా మారడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఎలాన్ మస్క్ ముందుగా చెప్పినట్లు శనివారం ది అమెరికా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకూ అమెరికాలో ఉన్న రిపబ్లికన్, డెమెక్రాట్ పార్టీలకు తోడు మూడొవ పార్టీగా ది అమెరికా పార్టీ పేరుతో నూతన పార్టీ అవతరించింది. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు విషయంలో యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తో తీవ్రంగా విభేధించిన ఆయన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ చీఫ్ పదవికి రాజీనామా కూడా చేశారు. అమెరికన్ల స్వేచ్ఛను హరించే ఈ బిల్లుకు తాను వ్యతిరేకమని ఈబిల్లు ఆమోదం పొందితే అమెరికన్ల స్వేచ్ఛను వారికి తిరిగి ఇవ్వడం కోసం తాను రాజకీయ పార్టీ పెడతానని మస్క్ గతంతో ప్రకటించారు. అందుకు తగ్గ విధంగానే అమెరికన్ కాంగ్రెస్ లో బిగ్ బ్యూటీఫుల్ బిల్లుకు ఆమోదం లభించిన మరుసటి రోజే ఆయన పార్టీ ప్రారంభిస్తున్నట్లు తన సొంతదైన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించారు. అంతకు మందు ఎలాన్ మస్క్ ఎక్స్ లో ఒక పోలింగ్ నిర్వహించారు. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టే సమయం ఆసన్నమయ్యిందా అని ఒక ప్రశ్నను పోస్ట్ చేశారు. ఇందులో దాదాపు 15లక్షల మంది పాల్గొని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. దాదాపు 80 శాతం మంది కొత్త రాజకీయ పార్టీ అవసరముందని ఓటు వేయడంతో ది అమెరికా పార్టీ ప్రారంభిస్తున్నట్లు మస్క్ ఎక్స్ లో తన రెండొవ పోస్టు ద్వారా వెల్లడించారు. అమెరికాలో 80 శాతం మందికి ది అమెరికా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుందని మస్క్ అంటున్నారు. ఈ పార్టీ డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని మస్క్ చెప్పుకొచ్చారు.