H-1B Visas: H-1B వీసాలు: కొత్త దరఖాస్తులు నిలిపివేయాలి-టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక ఆదేశాలు

టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక ఆదేశాలు

Update: 2026-01-28 16:59 GMT

H-1B Visas: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఏజెన్సీలు కొత్త H-1B వీసా పిటిషన్లను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధన 2027 మే 31 వరకు అమలులో ఉంటుంది.

H-1B వీసా కార్యక్రమం దుర్వినియోగం అవుతోందని అబాట్ ఆరోపించారు. అమెరికన్ ఉద్యోగాలు దేశీయ కార్మికులకే దక్కేలా చూడాలని, దీనిపై సమీక్ష జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఏజెన్సీలకు రాసిన లేఖలో అబాట్ "హెచ్-1బీ వీసా కార్యక్రమం దుర్వినియోగం అయిందని నివేదికలు వెల్లడించాయి. అమెరికన్ ఉద్యోగుల ప్రయోజనం కోసం దీనిపై సమీక్ష చేయడం అవసరం. అందుకే కొత్త పిటిషన్లను వెంటనే నిలిపివేయాలని ఆదేశిస్తున్నాను" అని స్పష్టం చేశారు.

టెక్సాస్ ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనం కోసం పని చేయాలని అబాట్ పిలుపునిచ్చారు. పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చే ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రం ఆదర్శంగా నిలవాలన్నారు. అర్హత ఉన్న అమెరికన్ కార్మికులు అందుబాటులో ఉన్నప్పటికీ, కొందరు యజమానులు విదేశీయులను నియమించుకుని H-1B కార్యక్రమాన్ని దుర్వినియోగం చేశారని, కొన్ని సందర్భాల్లో అమెరికన్ ఉద్యోగులను తొలగించి తక్కువ వేతనాలకు H-1B ఉద్యోగులను తీసుకున్నారని అబాట్ ఆరోపించారు.

కాలిఫోర్నియా తర్వాత అమెరికాలో అత్యధిక H-1B వీసా హోల్డర్లు ఉన్న రాష్ట్రం టెక్సాస్. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం, 2025లో 6,100 మంది యజమానుల వద్ద 40 వేలకు పైగా H-1B వీసాలు మంజూరు చేయబడ్డాయి. టెక్సాస్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో దాదాపు 1,200 మంది H-1B ఉద్యోగులు పని చేస్తున్నారు.

Tags:    

Similar News