DALLAS ROAD ACCIDENT : అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ వాసుల మృతి

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనం;

Update: 2025-07-08 01:51 GMT

అమెరికాలో నివశిస్తున్న ప్రవాశాంద్రుల కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురై సజీవ దహనం అయిపోయారు. హైదరాబాద్‌ తిరుమలగిరికి చెందిన వెంకట్‌ భార్య తేజస్విని, కుమారుడు సిద్ధార్ధ, కుమార్తె మృదుల గత కొంత కాలంగా డల్లాస్‌ లో నివసిస్తున్నారు. వీరి కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆదివారం రాత్రి రాంగ్‌ రూట్‌ లో వస్తున్న ఒక ట్రక్కు వచ్చి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకట్‌ కుటుంబం ప్రయాణిస్తున్న కారులో పెద్ద యెత్తున మంటలు చెలరేగాయి. దీంతో వెంకట్‌ తో పాటు అతని భార్య, పిల్లలు ఇద్దరూ సజీవ దహనం అయిపోయారు. తిరుమలగిరికి చెందిన పశుపతినాథ్‌, గిరిజల కుమారుడు వెంకట్‌ కు జీడిమెట్ల కు చెందిన తేజస్వినితో 2013లో వివాహం జరిగింది. మూడు సంవత్సరాల క్రితమే వెంకట్‌ కుటుంబం డల్లాస్‌ వెళ్లారు. అట్లాంటాలో ఉన్న వెంకట్‌ సోదరి దీపక ఇంటికి తల్లిదండ్రులతో కలసి వీకెండ్‌ గడడానికి వెంకట్ కుటుంబం వెళ్లింది. తిరుగు ప్రయాణంలో వెంకట్‌ తల్లిదండ్రులు విమానంలో అట్లాంటా నుంచి డల్లాస్‌ వెళ్లగా వెంకట్‌ భార్యా పిల్లలతో కారులో రోడ్డు మార్గం ద్వారా డల్లాస్‌ బయలుదేరారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై అగ్నికి ఆహుతి అవ్వడంతో కారులో ప్రయాణిస్తున్న వెంకట్ కుటుంబం మొత్తం అగ్నికి ఆహుతై అక్కడిక్కడే మృతి చెందారు. అయితే అట్లాంటా నుంచి విమానంలో డల్లాస్‌ చేరుకున్న వెంకట్‌ తల్లిదండ్రులు కుమారుడు, కోడలు, మనవలు ఎంతకీ రాకపోవడంతో ఆరా తీయగా ప్రమాద సంఘటన వెలుగులోకి వచ్చింది.

Tags:    

Similar News