సబ్సిడీలు లేకపోతే మస్క్ తిరిగి సౌత్ ఆఫ్రికా వెళ్లిపోవాలి – ట్రంప్
బిగ్ బ్యూటీఫుల్ బిల్ ఆమోదిస్తే తాను ఆ మర్నాడే రాజకీయ పార్టీ పెడతానని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఎలాన్ మస్క్ వ్యవహార సరళిని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. ఎలాన్ మస్క్ చరిత్రలో ఇంత వరకూ ఏ మానవుడు పొందనంత సబ్సిడీ పొందుతున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ సబ్సిడీలే లేకపోతే మస్క్ అమెరికాలో దుకాణం మూసేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుందని ట్రాంప్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. మస్క్ వ్యవహార సరళి మార్చుకోకపోతే రాకెట్ ప్రయోగాల నుంచి ఉపగ్రహ ఉత్పత్తి,ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వరకు ప్రతిదీ నిలిపివేస్తారని ట్రంప్ హెచ్చరించారు. ఈ అంశాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) కఠినంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ట్రంప్ చమత్కరించారు. అటువంటి సబ్సిడీలు తగ్గించడం ద్వారా పన్ను చెల్లింపుదారుల డబ్బు ఆదా చేయవచ్చని ట్రంప్ సూచించారు.
అమెరికా అధ్యక్షస్ధానానికి నా అభ్యర్ధిత్వాన్ని ఎలాన్ మస్క్ మద్దతు తెలపడానకి చాలా కాలం ముందు నుంచే నేను ఈవీ మాండేట్ ను వ్యతిరేకించానని ఈవిషయం అతనికి ఊడా తెలుసని ట్రంప్ అన్నారు. ఎలక్ట్రిక్ కార్లు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని బలవంతం చేయకూడదని ఈ విషయాన్ని తాను ఎల్లప్పుడూ నా ప్రచారంలో చెపుతుంటానని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మొత్తం మీద బిగ్ బ్యూటీఫుల్ బిల్లు డోనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ల మాధ్య చిచ్చు రాజేస్తోంది. ఇది ఎంత దూరం వెళ్ళి ఆగుతుందో అని అమెరికా ఆసక్తిగా ఎదరు చూస్తోంది.