New Headache for Pakistan: పాకిస్తాన్‌కు కొత్త తలనొప్పి: టీటీపీ వైమానిక దళం ఏర్పాటు ప్రణాళిక!
టీటీపీ వైమానిక దళం ఏర్పాటు ప్రణాళిక!
New Headache for Pakistan: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) ఉగ్ర సంస్థ బలోపేతమవుతోంది. కొత్త సంవత్సరంలో తమ కార్యకలాపాలను మరింత ఉధృతం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ సైన్యానికి ఢీ అంటూ స్వంత వైమానిక దళాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించడంతో పాక్ అధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
2026లో ఈ వైమానిక దళాన్ని ప్రారంభిస్తామని టీటీపీ స్పష్టమైన ప్రకటన చేసింది. సలీం హక్కానీ నేతృత్వంలో దీన్ని నడిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. అంతేకాదు, ప్రావిన్సుల వారీగా సైనిక మోహరింపులు, ప్రత్యేక మిలిటరీ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మిలిటరీ కమాండర్లతో కూడిన రెండు కొత్త పర్యవేక్షణ జోన్లను సృష్టించనుంది. కశ్మీర్, గిల్గిత్-బాల్టిస్తాన్‌తో పాటు ఇతర కీలక ప్రాంతాలను తమ నియంత్రణలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా సైనిక నాయకత్వంలో మార్పులు కూడా చేపట్టింది.
2022 నవంబరులో పాకిస్తాన్ ప్రభుత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని టీటీపీ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పాక్ భద్రతా దళాలు, పోలీసులు, అధికారులపై వరుస దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో తమ ప్రభావాన్ని విస్తరించింది. అఫ్గానిస్తాన్ భూభాగం నుంచి ఈ దాడులు జరుపుతున్నట్లు పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది.
టీటీపీ ఈ కొత్త ప్రణాళికలతో పాకిస్తాన్‌కు మరింత తీవ్రమైన సవాళ్లు ఎదురవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక, రాజకీయ సంక్షోభాల్లో కూరుకుపోయిన పాక్‌కు ఈ ఉగ్ర ముప్పు అదనపు భారమవుతుంది.