Bangladesh Interim Government Clarifies: భారత్‌తో వివాదాలు అక్కర్లేదు: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పష్టం

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పష్టం

Update: 2025-12-24 05:51 GMT

Bangladesh Interim Government Clarifies: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పొరుగున ఉన్న భారత్‌తో మంచి సంబంధాలనే కోరుకుంటోందని, ఎలాంటి గొడవలు లేదా ఉద్రిక్తతలు వద్దని ఆ దేశ ఆర్థిక సలహాదారు డాక్టర్ సలేహుద్దీన్ అహ్మద్ స్పష్టం చేశారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో భారత్ వ్యతిరేక ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు కాస్త దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో సలేహుద్దీన్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

పెద్ద పొరుగు దేశమైన భారత్‌తో ఎలాంటి చేదు సంబంధాలు కోరుకోవడం లేదని, బదులుగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతోనే తాత్కాలిక ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకుంటూనే ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంచేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ ఉద్రిక్తతలను తగ్గించి, సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ వ్యక్తిగతంగా కృషి చేస్తున్నారని ఆయన వివరించారు. ఇది రెండు దేశాలకూ ఎంతో మేలు చేస్తుందని స్పష్టంచేశారు.

ఇటీవలి భారత్ వ్యతిరేక ఆందోళనలు పూర్తిగా రాజకీయ కోణంలో జరిగినవని, వాటికి తాత్కాలిక ప్రభుత్వంతో ఎలాంటి లింక్ లేదని సలేహుద్దీన్ అహ్మద్ నొక్కి చెప్పారు. ఈ ఆందోళనల వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని హామీ ఇచ్చారు.

ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే భాగంగా భారత్ నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకునే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, భారత్-బంగ్లాదేశ్ సంబంధాలను దెబ్బతీసేందుకు బయటి శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై తాత్కాలిక ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోందని సలేహుద్దీన్ అహ్మద్ తెలిపారు.

Tags:    

Similar News