US Senator Ted Cruz: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం అడ్డంకులు: ముగ్గురు నాయకులు బ్లాక్ చేశారని యూఎస్ సెనెటర్ టెడ్ క్రూజ్ సంచలన ఆరోపణలు
ముగ్గురు నాయకులు బ్లాక్ చేశారని యూఎస్ సెనెటర్ టెడ్ క్రూజ్ సంచలన ఆరోపణలు
US Senator Ted Cruz: భారత్ మరియు అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం (ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్) పై ఇంకా అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా సెనెటర్ టెడ్ క్రూజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరియు శ్వేతసౌధం సలహాదారు పీటర్ నవారోలు ఈ ఒప్పందాన్ని అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. క్రూజ్ మాట్లాడిన ఆడియో రికార్డింగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని ఆధారంగా చేసుకుని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.
ట్రంప్ అనుసరిస్తున్న టారిఫ్ విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించవచ్చని క్రూజ్ ఆ ఆడియోలో పేర్కొన్నారు. ఈ టారిఫ్‌లపై మరోసారి ఆలోచించాలని సూచిస్తూ ట్రంప్‌కు ఫోన్ చేసి మాట్లాడానని చెప్పారు. అయితే, ట్రంప్ తమపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఆయన గుర్తుచేసుకున్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల గురించి తాను హెచ్చరించానని, "ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. మీరు అభిశంసన ప్రమాదం ఎదుర్కోవచ్చు" అని చెప్పినా, అది ప్రయోజనం లేకుండా పోయిందని వివరించారు.
ఈ వాణిజ్య ఒప్పందం విషయంలో అమెరికా నుంచి విభిన్న స్పందనలు వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ, భారత్‌తో ఒప్పందం కుదరకపోవడానికి విధానపరమైన అడ్డంకులు కారణం కాదని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్‌తో నేరుగా మాట్లాడేందుకు నిరాకరించడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. మరోవైపు, ప్రధాని మోదీపై తనకు ఎంతో గౌరవం ఉందని, త్వరలోనే మంచి వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే.