Osama Bin Laden: ఒసామా బిన్ లాడెన్: తోరాబోరా కొండల నుంచి మహిళా వేషంలో తప్పించుకున్నాడు..
తోరాబోరా కొండల నుంచి మహిళా వేషంలో తప్పించుకున్నాడు..
Osama Bin Laden: 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన ఉగ్రదాడి అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణమైన సంఘటన. ఆ మారణకాండకు ప్రధాన సూత్రధారి అయిన ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకోవడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. అమెరికా సైన్యం అతన్ని చుట్టుముట్టిన సమయంలో మహిళా వేషంలో తప్పించుకున్నాడని మాజీ సీఐఏ అధికారి జాన్ కిరియకౌ తాజాగా వెల్లడించారు.
కిరియకౌ 15 సంవత్సరాల పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో పనిచేశారు. జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ, అల్-ఖైదా ఏజెంట్ ఒకరు అమెరికా సైన్యంలోకి చొరబడిన విషయం తమకు తెలియలేదని చెప్పారు. "ఆ ఉగ్ర ఘటన జరిగిన నెల తర్వాత మేము అఫ్గానిస్థాన్‌పై బాంబు దాడులు ప్రారంభించాం. భావోద్వేగాలకు లోనుకాకుండా, ఉగ్రవాదుల స్థావరాల గురించి పూర్తి సమాచారం సేకరించి ఒక నెల తర్వాత దాడులు చేశాం. అఫ్గాన్‌లోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో అల్-ఖైదా బేస్‌లపై దాడి చేశాం. మేము బిన్ లాడెన్‌ను తోరాబోరా కొండలకు పరిమితం చేశామని భావించాం. పర్వతం నుంచి దిగి లొంగిపోవాలని ఆదేశించాం. అయితే, పిల్లలు మరియు చిన్నారులను తరలించడానికి కొంత సమయం కావాలని అతడు అడిగాడు. ఆ అనువాదకుడు అల్-ఖైదా సభ్యుడు. అతడు అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్‌కు అనువాదకుడిగా పనిచేస్తున్నాడు. అతడు సైన్యంలోకి చొరబడిన విషయం మాకు తెలియకపోవడంతో, లాడెన్ అభ్యర్థనను అంగీకరించమని ఆ అనువాదకుడు జనరల్ ఫ్రాంక్స్‌ను ఒప్పించాడు. దాంతో లాడెన్‌కు సమయం లభించి, మహిళా వేషంలో పికప్ ట్రక్ వెనక దాక్కుని పాకిస్థాన్‌కు పారిపోయాడు. ఫలితంగా మా ఆపరేషన్‌ను పాక్ వైపు మళ్లించాల్సి వచ్చింది" అని కిరియకౌ వివరించారు.
2001 సెప్టెంబరు 11న అల్-ఖైదా ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్ చేశారు. 19 మంది ఉగ్రవాదులు నాలుగు బృందాలుగా విడిపోయి, ట్విన్ టవర్స్ అని పిలిచే వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలపై దాడి చేశారు. ఈ దాడుల్లో 2,996 మంది మరణించగా, 25 వేల మంది సామాన్య పౌరులు గాయపడ్డారు. అమెరికా చరిత్రలో అతిపెద్ద ఉగ్రదాడిగా నిలిచిన ఈ సంఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. చివరకు 2011 మే 2న పాకిస్థాన్‌లోని అబ్బాటాబాద్‌లో దాక్కున్న లాడెన్‌ను అమెరికా సైనికులు అర్ధరాత్రి దాడిలో హతమార్చారు.
భారత్-పాక్ యుద్ధంపై సీఐఏ అంచనాలు..
2001లో భారత పార్లమెంట్‌పై జరిగిన దాడి తర్వాత అణ్వాయుధాలు కలిగిన భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతుందని సీఐఏ భావించిందని కిరియకౌ గుర్తుచేశారు. అయితే, సాంప్రదాయ యుద్ధంలో పాకిస్థాన్ ఓడిపోతుందని అభిప్రాయపడ్డారు. "భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగితే పాక్ ఓటమి తప్పదు. ఇక్కడ అణ్వాయుధాల గురించి మాట్లాడటం లేదు. భారత్‌ను నిరంతరం రెచ్చగొట్టడం వల్ల పాక్‌కు ఎలాంటి ప్రయోజనం లేదు" అని అన్నారు.