UAE to Iran: యూఏఈ నుంచి ఇరాన్‌కు రహస్యంగా బంగారం, నగదు బదిలీ
నగదు బదిలీ
UAE to Iran: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తన బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను భారీ మొత్తంలో విడుదల చేసినట్లు సమాచారం వెలువడింది. ఇందులో రెండు టన్నుల బంగారం కూడా ఉందని టెహ్రాన్‌కు చెందిన అధికారిక వర్గాలు తెలిపాయి.
అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు, దౌత్య ప్రయత్నాలు నిలిచిపోవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం గమనార్హం. భవిష్యత్తులో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే ఇరాన్ తమ దేశంపై దాడులు చేయకుండా ఉండేందుకే యూఏఈ ఈ వ్యూహాత్మక చర్యలు చేపట్టినట్లు నిపుణులు భావిస్తున్నారు.
ఖతార్, టెహ్రాన్ వర్గాల సమాచారం ప్రకారం ఆగస్టు 11, 12 తేదీల్లో అబుదాబి నుంచి ప్రత్యేక విమానాలు ఇరాన్‌లోని మెహరాబాద్ విమానాశ్రయం, కరాజ్ పయామ్ విమానాశ్రయాలకు వెళ్లాయి. ఈ విమానాలు అక్కడ కేవలం ఒక గంట మాత్రమే ఉండి తిరిగి యూఏఈకి చేరుకున్నాయి. అందులో ఒక విమానం జూన్ 8న కూడా అబుదాబి నుంచి మెహరాబాద్‌కు వెళ్లింది. ఆ సమయంలో దాదాపు 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.25 వేల కోట్లు) నగదును ఇరాన్‌కు బదిలీ చేసినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ పేర్కొంది.
తాజాగా పంపిన బంగారం (సుమారు రూ.2,300 కోట్ల విలువైనది), నగదు కూడా యూఏఈ బ్యాంకుల్లో లాక్ అయిన ఇరాన్ సొత్తేనని తెలుస్తోంది. అమెరికా విధించిన కఠినమైన ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇలాంటి సమయంలో యూఏఈ నుంచి పెద్ద మొత్తంలో నగదు, బంగారం అందడం ఇరాన్‌కు పెద్ద ఊరటనిచ్చే విషయమేనని విశ్లేషకులు చెబుతున్నారు.