WHO Director Ghebreyesus Responds: అమెరికా ఆరోపణలు అసత్యాలు: డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ ఘెబ్రెయెసస్
డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ ఘెబ్రెయెసస్
WHO Director Ghebreyesus Responds: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి అమెరికా వైదొలగడంపై ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసస్ తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. అమెరికా చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమైనవని, వాటిలో వాస్తవికత లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నిష్క్రమణ అమెరికాకు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలందరికీ సురక్షితం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే భవిష్యత్తులో అమెరికా మళ్లీ డబ్ల్యూహెచ్‌ఓలో చేరి క్రియాశీల పాత్ర పోషిస్తుందనే ఆశాభావాన్ని టెడ్రోస్ వ్యక్తం చేశారు.
ఆదివారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆయన ఈ విషయాలను పోస్ట్ చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌ఓ సకాలంలో సమాచారం అందించలేదని, దీని వల్ల అమెరికాలో భారీగా ప్రాణనష్టం జరిగిందని అమెరికా ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 22న అమెరికా ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్. కెనడీ జూనియర్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంయుక్త ప్రకటన విడుదల చేసి, డబ్ల్యూహెచ్‌ఓ నుంచి నిష్క్రమణకు కారణాలను వివరించారు.
దీనికి తాజాగా డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ కౌంటర్ ఇచ్చారు. అమెరికా ప్రకటనపై అధికారిక స్పందనతో కూడిన నోటిఫికేషన్‌ను కూడా ఆ పోస్ట్‌కు జత చేశారు.
మేం సకాలంలోనే స్పందించాం..
డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందని, కరోనా కట్టడిలో విఫలత్వం వల్లే నిష్క్రమించామని అమెరికా చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవమని సంస్థ స్పష్టం చేసింది. ‘‘మేం కరోనా మహమ్మారిపై సకాలంలోనే స్పందించాం. ఆనాడు అందుబాటులో ఉన్న కీలక సమాచారాన్ని వెంటనే ప్రపంచ దేశాలకు అందజేశాం. కరోనా వ్యాప్తి విషయంలో సమాచారాన్ని దాచినట్లు అమెరికా ఆరోపించడం సరికాదు’’ అని డబ్ల్యూహెచ్‌ఓ అధికారికంగా పేర్కొంది.
ఈ వివాదం ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో అమెరికా పాత్రపై కొత్త చర్చను రేకెత్తిస్తోంది.