US Flights: అమెరికా విమానాలు: షట్‌డౌన్ ప్రభావం.. 8000కి పైగా సర్వీసులు ఆలస్యం!

8000కి పైగా సర్వీసులు ఆలస్యం!

Update: 2025-10-27 11:07 GMT

US Flights: అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావం విమాన రవాణాపై తీవ్రంగా పడింది. దేశవ్యాప్తంగా ఆదివారం దాదాపు 8,000కి పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. షట్‌డౌన్ కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది హాజరు తగ్గడంతో వేలాది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రకారం, 22 ప్రాంతాల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల కొరత ఏర్పడింది. రవాణా మంత్రి షాన్ డఫీ మాట్లాడుతూ, "రానున్న రోజుల్లో ఈ కొరత మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో విమానాల ఆలస్యాలు, రద్దులు పెరగొచ్చు" అని తెలిపారు. ఫ్లైట్ అవేర్ వెబ్‌సైట్ డేటా ప్రకారం, అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11 గంటల వరకు 8,000కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి.

ప్రధాన విమానయాన సంస్థలపై ప్రభావం

ఈ సమస్య ప్రధాన విమానయాన సంస్థలను తీవ్రంగా ప్రభావితం చేసింది. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో 45% సర్వీసులు, అంటే దాదాపు 2,000 విమానాలు ఆలస్యమయ్యాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 1,200, యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు 739, డెల్టా ఎయిర్‌లైన్స్‌కు 600 సర్వీసులకు అంతరాయం కలిగింది. ఈ ఆలస్యాల వల్ల లక్షలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకున్నారు.

లాస్ ఏంజెలెస్ ఎయిర్‌పోర్టులో గందరగోళం

సిబ్బంది కొరత ప్రభావంతో అమెరికాలోని అత్యంత రద్దీ ఎయిర్‌పోర్టులలో ఒకటైన లాస్ ఏంజెలెస్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు ఆగిపోయాయి. ఈ ఎయిర్‌పోర్టుకు వెళ్లే విమానాలను దాదాపు రెండు గంటల పాటు నిలిపివేశారు. వాషింగ్టన్, న్యూ జెర్సీ, న్యూఆర్క్ ప్రాంతాల్లోనూ ఇదే స్థితి నెలకొంది. FAA అధికారులు ఈ పరిస్థితి వల్ల భద్రతా సమస్యలు తలెత్తకుండా చూసుకుంటున్నారు.

అక్టోబర్ 1 నుంచి అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లో ఉంది. దీంతో 13,000 మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, 50,000 మంది ట్రాన్స్‌పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (TSA) అధికారులు వేతనం లేకుండా విధులు చేస్తున్నారు. అయినప్పటికీ, కొందరు ATC సిబ్బంది హాజరుకాకపోవడంతో ఈ గందరగోళం తీవ్రమవుతోంది. ప్రభుత్వం షట్‌డౌన్ త్వరలోనే ముగిస్తుందని ఆశలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News