US President Donald Trump: అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గమ్‌ను నియమించినందుకు ట్రంప్ విచిత్ర వ్యాఖ్యలు
ట్రంప్ విచిత్ర వ్యాఖ్యలు
US President Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్‌లో ఇంటీరియర్ సెక్రటరీ పదవికి డగ్ బర్గమ్‌ను నియమించారు. ఈ నియామకంపై మాట్లాడుతూ ట్రంప్ విచిత్రమైన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బర్గమ్ భార్య అందంగా ఉండటమే ప్రధాన కారణంగా ఆయనకు ఈ పదవి ఇచ్చానని ట్రంప్ వెల్లడించారు.
గురువారం (అమెరికా కాలమానం ప్రకారం) మాదకద్రవ్యాల నియంత్రణ లక్ష్యంగా ఒక ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. ఆ తర్వాత ఓవల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బర్గమ్ భార్య క్యాథరిన్‌తో కలిసి గుర్రపు స్వారీ చేస్తున్న వీడియో చూశాను. అందులో ఆమె చాలా ఆకర్షణీయంగా, అందంగా కనిపించింది. ఆమె ఎవరని నా సిబ్బందిని అడిగాను. వారు ఈ జంట గురించి వివరించగానే నాకు ఒక అభిప్రాయం ఏర్పడింది. ప్రధానంగా ఆ కారణంతోనే డగ్‌కు ఈ పదవి ఇచ్చాను’’ అని ట్రంప్ అన్నారు.
ఈ సందర్భంలో డగ్ బర్గమ్, ఆయన సతీమణి క్యాథరిన్ బర్గమ్ అక్కడే ఉన్నారు. ట్రంప్ మాట్లాడుతుంటే వారు అక్కడే నిలబడి ఉన్నారని గమనార్హం. ట్రంప్ మరింత వివరిస్తూ.. ‘‘డగ్ బర్గమ్ విజయవంతమైన బిజినెస్ మ్యాన్. నార్త్ డకోటాకు రెండుసార్లు గవర్నర్‌గా పనిచేశాడు. అయితే, ఆయన విజయం వెనక భార్య పాత్ర కీలకంగా ఉండి ఉంటుంది. వీరిద్దరూ అద్భుతమైన జంట’’ అని కొనియాడారు.
అయితే, ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ట్రంప్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలను కించపరిచేలా, అసంబద్ధంగా మాట్లాడారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ మహిళల విషయంలో ట్రంప్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరోసారి ఆయన మాటల తీరుపై చర్చను రేకెత్తించింది.