USA: అమెరికా సైబర్‌ రక్షణ ఇంచార్జ్‌పై ఆరోపణలు: చాట్‌జీపీటీలో రహస్య ఫైళ్ల అప్‌లోడ్‌!

చాట్‌జీపీటీలో రహస్య ఫైళ్ల అప్‌లోడ్‌!

Update: 2026-01-29 10:38 GMT

USA: అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన రహస్య ఫైళ్లను చాట్‌జీపీటీ పబ్లిక్‌ వెర్షన్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు భారత సంతతికి చెందిన మధు గొట్టుముక్కల. యూఎస్‌ సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (సీఐఎస్‌ఏ) తాత్కాలిక చీఫ్‌గా పనిచేస్తున్న ఆయనపై ఈ ఆరోపణలు వచ్చాయి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) అధికారులను ఉటంకిస్తూ పొలిటికో వార్తా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.

గత ఏడాది మే నెలలో సీఐఎస్‌ఏ తాత్కాలిక చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన మధు గొట్టుముక్కల, ఏఐ చాట్‌బాట్‌కు యాక్సెస్‌ కోసం ఒత్తిడి చేశారని అధికారులు చెబుతున్నారు. అయితే, హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ వంటి విభాగాల ఉద్యోగులకు చాట్‌జీపీటీ వాడకంపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అనుమతి తీసుకొని దాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఐఎస్‌ఏకు సంబంధించిన కాంట్రాక్టు ఫైళ్లతో సహా కీలక సమాచారాన్ని అప్‌లోడ్‌ చేశారని తెలుస్తోంది. ఈ ఫైళ్లలో అత్యంత రహస్యమైన వివరాలు ఉన్నాయని, వాటిని బహిర్గతం చేయడం సరికాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఆగస్టు నెలలో సీఐఎస్‌ఏ అంతర్గత సైబర్‌ భద్రతా వ్యవస్థలు ఈ అప్‌లోడ్‌పై హెచ్చరికలు జారీ చేశాయి. దీని వల్ల ఎదురయ్యే పరిణామాలపై డీహెచ్‌ఎస్‌ దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని సమాచారం. ఇదిలా ఉండగా, సీఐఎస్‌ఏ పబ్లిక్‌ అఫైర్స్‌ డైరెక్టర్‌ మార్సీ మెక్‌కార్తీ ఈ విషయంపై స్పందిస్తూ.. మధు గొట్టుముక్కలకు డీహెచ్‌ఎస్‌ నియంత్రణలో చాట్‌జీపీటీ వాడకానికి తాత్కాలిక అనుమతి ఉందని చెప్పారు. అయితే, ఈ అప్‌లోడ్‌ ద్వారా సమాచారం ఓపెన్‌ఏఐకి షేర్‌ అయ్యే ప్రమాదం ఉందని, యూజర్లు ప్రశ్నలు అడిగితే ఆ వివరాలు బయటపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ ఘటన సైబర్‌ భద్రతా విషయాల్లో ఏఐ సాధనాల వినియోగంపై మరిన్ని చర్చలకు దారితీస్తోంది.

Tags:    

Similar News